హైదరాబాద్:
పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ శశి భూషణ్ రావును ధన్వంతరి నేషనల్ అవార్డు వరించింది. కళా నిలయం కల్చర్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలుగు సారస్వత పరిషత్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కూచిపూడి నృత్య కారిణి డాక్టర్ ఎస్ పి భారతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. డాక్టర్ శశిభూషణ్ రావు నాయుడు క్లినిక్ పేరుతో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరో అతిధిగా సరస్వతి ఉపాసకులు దైవాజ్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. పల్మానాలజీ రంగంలో నిపుణులు అయిన డాక్టర్ శశి భూషణ్ రావు అనేక మంది పేదలకు ఉచితంగా సేవలు అందించడం అభినందనీయమని డాక్టర్ ఎస్ పి భారతి ఈ సందర్భంగా కొనియాడారు. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో పేదలకు అందని ద్రాక్షలా మారిందని, అలాంటి సమయంలో పేదలకు ఉచితంగా పల్మనాలజీ సేవలు అందించడం ఎంతో అభినందనీయమని ఆమె అన్నారు. ధన్వంతరి నేషనల్ అవార్డు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత డాక్టర్ శశి భూషణ్ రావు అన్నారు. ఇలాంటి అవార్డులు మరింత బాధ్యతలను పెంచుతాయన్నారు. పేదలకు ఉచితంగా సేవలు అందించడంలో తాను ముందు వరుసలో ఉంటానని ఆయన చెప్పారు.