అక్రమంగా నిల్వ చేసిన PDS బియ్యం పట్టివేత

గుంటూరు
పేద ప్రజలకు పంపిణీ చేయవలసిన రేషన్ బియ్యమును ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలోని విజయలక్ష్మి రైస్ ట్రేడర్స్ నందు అక్రమంగా నిల్వ చేసి లారీల ద్వారా అక్రమంగా తరలించి బ్లాక్ లో అమ్ముచున్నట్లుగా రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారి  ఎస్.వి.మాధవ్ రెడ్డి పర్యవేక్షణలో ది.07.02.2023 వేకువఝామున విజిలెన్స్ అధికారులు ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలోని విజయలక్ష్మి రైస్ ట్రేడర్స్ కు కొంత దూరంలో నిఘా వేసి, మిల్లులో నుండి లోడ్ తో బయటకు వెళ్ళుచున్న లారీని ఆపి తనిఖీ చేసినారు. లారీ నం. GJ11VV.7609 లో 600 బస్తాల తెల్ల సంచులలో PDS బియ్యం వున్నట్లు గుర్తించారు. డ్రైవర్ చుక్కా మాణిక్యరావును విచారించగా, విజయలక్ష్మి రైస్ ట్రేడర్స్ యజమాని పసుమర్తి వెంకట శివనాగ ప్రసాద్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం 600 బస్తాల బియ్యం లోడును గుజరాత్ రాష్ట్రమునకు తీసుకు వెళ్ళు చున్నట్లు చెప్పినాడు. స్టాకుకు సంబంధించి ఏ విధమైన బిల్లులు చూపలేక పోయినాడు. విజయలక్ష్మి రైస్ ట్రేడర్స్ లో తనిఖీ చేయగా 792 తెల్ల సంచులలో PDS బియ్యం కలవు. మరియు రాశిగా పోసి ఉన్న బియ్యమును బస్తాలలోనికి ఎత్తించి చూడగా 450 బస్తాలు అయినవి. అచ్చటనే AP స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ ముద్రలు కలిగిన 12 సంచులు కూడా వున్నవి. విచారణలో విజయలక్ష్మి రైస్ ట్రేడర్స్ యజమాని పసుమర్తి వెంకట శివనాగ ప్రసాద్ PDS బియ్యం అక్రమంగా కొనుగోలుచేసి సంచులు మార్చి తప్పుడు రికార్డ్ లతో సబ్సిడీ బియ్యం అక్రమవ్యాపారం చేయుచున్నట్లు కనుగొన్నారు. రైస్ ట్రేడర్స్ లోని 1242 బస్తాలు మరియు లారీ లోని 600 బస్తాలతో కలిపి మొత్తం 1842 బస్తాలలో కల 921 క్వింటాళ్ళ PDS బియ్యం స్వాధీన పరచుకొన్నారు. PDS బియ్యం అక్రమవ్యాపారం చేయుచున్న విజయలక్ష్మి రైస్ ట్రేడర్స్ యజమాని పసుమర్తి వెంకట శివనాగ ప్రసాద్ మరియు లారీ డ్రైవర్-కం-ఓనర్ చుక్కా మాణిక్యరావుపై 6A మరియు క్రిమినల్ కేసులు నమోదు చేయవలసినదిగా స్థానిక అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ను విజిలెన్సు అధికారులు ఆదేశించినారు.

పై తనిఖీలలో విజిలెన్సు ఇన్స్పెక్టర్  ఎ. శ్రీహరి రావు, తహసిల్దార్  K.నాగమల్లేశ్వరరావు, ఎస్.ఐ.  ఎం.రామచంద్రయ్య, స్థానిక పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి,
గుంటూరు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest