అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంలో తామే కమిటీ వేస్తామన్న సుప్రీంకోర్టు

 

  • హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ వ్యాపారంపై పెను ప్రభావం
  • సుప్రీంకోర్టులో పిటిషన్లు విచారణ చేపట్టిన సీజేఐ బెంచ్
  • ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించిన ధర్మాసనం

న్యూ ఢిల్లీ

అదానీ వ్యాపార సామ్రాజ్య స్థితిగతులపై ఇటీవల హిండెన్ బర్గ్ నివేదిక తీవ్ర కలకలం సృష్టించడం తెలిసిందే. ఈ నివేదిక నెగెటివ్ ప్రభావం చూపడంతో, అదానీ ఒక్కరోజులో రూ.50 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ దిగజారింది. అదానీ గ్రూప్ అకౌంట్లలో మోసాలకు పాల్పడుతోందని ఆ నివేదికలో పేర్కొన్న ఒక్క మాట అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని తీవ్రంగా కుదిపివేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా అదానీలకు వెన్నుదన్నుగా నిలుస్తోందని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం రాజకీయ పక్షాలు తమ విమర్శలకు మరింత పదునుపెట్టాయి. ఈ క్రమంలో, అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించింది. కమిటీ నియామకం కోసం కేంద్రం సీల్డ్ కవర్ లో కొందరు నిపుణుల పేర్లను సూచించగా సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్ధివాలాలతో కూడిన సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. సభ్యుల పేర్లు, కమిటీ విధివిధానాలతో కూడిన వివరాలను కేంద్రం ఈ నెల 13నే సుప్రీంకోర్టుకు అందించింది. ఈ వ్యవహారంలో తామే విచారణ జరుపుతామని ఆ మేరకు కేంద్రం ప్రతిపాదించింది. అయితే అందుకు సుప్రీంకోర్టు అడ్డు చెప్పింది. సీల్డ్ కవర్ లో ప్రభుత్వం సమర్పించిన సూచనలకు తాము ఆమోదం తెలిపితే, అది ప్రభుత్వ కమిటీయేనన్న భావన ఏర్పడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు, ఈ వ్యవహారంలో పారదర్శకత లోపిస్తుందని, ఈ కేసులో ఓ వర్గం పూర్తిగా అంధకారంలో చిక్కుకుంటుందని వివరించింది. అందుకే అదానీ-హిండెన్ బర్గ్ అంశంలో తామే కమిటీ వేస్తామని, సభ్యుల నియామకం తామే చేపడతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఇందులో సిట్టింగ్ జడ్జి నియామకం ఉండబోదని పేర్కొంది. అనంతరం తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు వెల్లడించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest