అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్‌

 

  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో బీఆర్ఎస్ పార్టీని భయపెడుతుంది
  • అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ
  • రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం
  • 110 సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ.. బీసీని సీఎం ఎలా చేస్తుంది
  • మీట్ ది ప్రెస్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో బీఆర్ఎస్ పార్టీని భయపెడుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారం కోల్పోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హమీనిచ్చారు.
తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన.. సమైక్య పాలకుల ఆధిపత్యం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన విధ్వంసమని అన్నారు. తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని గుర్తుచేశారు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని ఆరోపించారు. అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని పేర్కొన్నారు.
కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని.. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదన్నారు. అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందని స్పష్టం చేశారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చెందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని వెల్లడించారు. ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్ను ప్రజల ముందుంచామని తెలిపారు. తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలని సూచించారు.
“కేసీఆర్కు రైతు రుణమాఫీ చేయాలన్న చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. అందులో అనుమానం లేదు. అధికారం కోల్పోతున్నామన్న విచక్షణ కోల్పోయి కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమైనప్పుడు సీమాంధ్ర పాలకులు మాట్లాడినట్లు ఇవాళ వాళ్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రేషనలైజేషన్ పేరుతో 12 వేల పాఠశాలలు మూసేశారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్ను గద్దె దించాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలని సూచించారు. ఈ ఉద్యమం పరిపాలన కోసమని, అధికారం కోసం కాదని.. తెలంగాణ ఆత్మగౌరవం కోసమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదని.. ఆయన రాచరికం అనుకుంటున్నారని ఆరోపించారు.
కేసీఆర్ సీఎం హోదాలో అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇస్తున్న విద్యుత్ కొంటున్నది కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేని కేసీఆర్.. కాంగ్రెస్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయి. 2 వేల పెన్షన్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఇచ్చే పెంషాన్ కంటే కర్ణాటకలో పెన్షన్‌తో పాటు మహిళలకు అదనంగా నగదు బదిలీ అవుతోంది. కేసీఆర్ సవాల్‌లో పస లేదు. 60 నెలల్లో కేసీఆర్ పేదలకు 1 లక్షా 80 వేలు బాకీ ఉన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
110 సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ.. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని బీజేపీని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. ఒకరు మాత్రమే ఓబీసీ సీఎం ఉన్నారని ఆయన తెలిపారు. బీసీ గణన చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్నా బీజేపీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీగణన చేయలేని పార్టీ బీసీ సీఎంను ఎలా చేస్తుందని నిలదీశారు. బలహీనవర్గాలు కేసీఆర్‌ను ఓడించాలన్న కసితో ఉన్నారని, ఆ ఓట్లను చీల్చి కేసీఆర్‌కు సహకరించడమే బీజేపీ వ్యూహమని దుయ్యబట్టారు. ఎన్నికల కోసమే బీజేపీ ఎస్సీ వర్గీకరణ హామీ ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఏబీసీడీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామన్నారు… ఇప్పటికీ అతీగతి లేదని ఎద్దేవా చేశారు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా.. బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండ చీల్చేందుకే కమిటీతో కాలయాపన అని ఆరోపించారు.
కేసీఆర్ ఉద్యమకారుడు కాదు.. ఫక్తు రాజకీయ నాయకుడు…ఆయనకు రావాల్సినదానికంటే ఎక్కువే వచ్చాయి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ తెలంగాణ అమరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటాం…స్వాతంత్ర్య సమరయోధులతో సమానంగా తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తామన్నారు. అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడం కాంగ్రెస్ విధానం..ప్రగతిభవన్ ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్ గా మారుస్తామన్నారు రేవంత్ రెడ్డి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రపంచంతో పోటీ పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ లా ఉన్నవాటిని కూలగొట్టి కొత్తవాటిని కట్టే విధానాలకు కాంగ్రెస్ స్వస్తి పలుకుతుందన్నారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగానే బడ్జెట్ ను ఖర్చు చేస్తామన్నారు. సీఎం ఎవరనేదానిపై పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కౌలు రైతులను గుర్తిస్తాం… వారికి గుర్తింపు కార్డు ఇచ్చి ఆదుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. భూ యజామానికి, కౌలు రైతులకు, రైతు కూలీలకు అందరికీ ఆర్థికసాయం అందిస్తాం..ఇందులో గందరగోళం ఏమీ లేదు.. బీఆరెస్ గందరగోళం సృష్టించాలని చూస్తోందని విమర్శించారు. మా ఆరు గ్యారంటీలు అసాధ్యమన్న కేసీఆర్ దానికి రాజముద్ర వేశారు.కాంగ్రెస్ మేనిఫెస్టోనే మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్.. రాష్ట్రంలో సంకీర్ణం అనే చర్చే లేదు.. అనుమానం అక్కర్లేదు… 80-85 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయని రేవంత్రెడ్డి విమర్శించారు. అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్కు దుఃఖం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాస్రా పహాణీ లాంటి మాన్యువల్ రికార్డులను యథాతథంగా భూమాత ద్వారా డిజిటలైజ్ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ధరణి కేసీఆర్ కు ఏటీఎంలా మారింది ధరణి పేరుతో జరిగిన దోపిడీపై సంపూర్ణంగా విచారణ చేపడతామన్నారు. కేసీఆర్ పాలనలో జరిగినంత దోపిడీ నిజాం కాలంలోనూ జరగలేదని విమర్శించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest