అబద్దాలతో ప్రజలను నమ్మించలేరు:ఆదిమూలపు

 

అమరావతి:

అబద్దాలను పదేపదే వండి వార్చినంత మాత్రాన ప్రజలు నమ్మరని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. టిడ్కో గృహాలపై పైన హుషారు లోపల ఉసూరు అంటూ ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఒక ప్రకటనలో మంత్రి ఖండించారు. నంద్యాలలో పూర్తికాకుండా అసంపూర్తిగా ఉన్న గృహాల ఫోటోలను తీసి తప్పుడు కథనాలను ప్రచురించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలోని ఎన్ఎం నగర్, ఎస్ ఆర్ బి సి కాలనీ, అయ్యలూరిమెట్ట ప్రాంతాల్లో మొత్తం పదివేల గృహాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనులు చేయడం జరుగుతుందన్నారు. వాటిలో అన్ని సౌకర్యాలతో పూర్తయిన 2000 గృహాలను జనవరి ఏడో తేదీన లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. మిగిలిన గృహాల్లో పనులు జరుగుతున్నాయని, పనులు జరుగుతున్న గృహాల్లోని ఫోటోలను తీసి లోపల ఉసూరు అంటూ అసత్య కథనాన్ని ప్రచురించడం సమంజసం కాదన్నారు. మిగిలిన గృహాలను అన్ని వసతులతో పూర్తిచేసి జూన్ ఆఖరు నాటికి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టిడ్కో గృహాలను అన్ని వసతులతో పూర్తి చేసేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తుందన్నారు. నిర్దేశించిన గడువు ప్రకారం మార్చి నాటికి 1లక్ష 50 వేలు, జూన్ లో 50 వేలు, 2023 డిసెంబర్ కు 62,616 గృహాలు కలిపి మొత్తం 2,62,616 గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest