ఆంధ్రప్రదేశ్‌ లో ‘సమగ్ర కులగణన’

అమరావతి

ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తన దార్శనికతతో ఒక మహత్తరమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రేపట్నుంచీ (బుధవారం) ‘సమగ్ర కులగణన’ కార్యక్రమం చేపట్టనుంది. దీనికి సంబంధించి ఈనెల మూడో తేదీనే కేబినెట్‌ సమావేశంలో మంత్రిమండలి కులగణనకు ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల నిరుపేదలకు సామాజిక, సాధికారతా సురక్షను కల్పించడమే లక్ష్యంగా సమగ్ర కుల గణన కార్యక్రమాన్ని చేపడుతున్నాం.

వెనుకబాటు వర్గాల గుర్తింపునకు ఆస్కారంః
రాష్ట్రంలో దాదాపు 139 బీసీ కులాల ఆకాంక్షలు నెరవేరడానికి ఈ కార్యక్రమం దోహదపడుతోంది. సమగ్ర కుల గణన ద్వారా ఈ రాష్ట్రంలో అనేక వెనుకబాటు వర్గాల్ని గుర్తించే ఆస్కారం లభిస్తోంది. ఈనెల 15వ తేదీ (బుధవారం)న రాష్ట్రంలో తొలుత 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పైలెట్‌ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేపట్టి, నిర్వహణ, విధాన పరమైన అంశాలను క్రోడీకరించి రాష్ట్రమంతటా ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తాము. కుల గణనకు సంబంధించి వివిధ కుల సంఘాలు హాజరుకానున్నాయి. ఆయా ప్రాంతాల కులాల స్థితిగతులు, వారు క్షేత్రస్థాయిలో అనుభవిస్తున్న సామాజిక అంశాలపై కులసంఘాల ప్రతినిధుల సూచనల్ని స్వీకరిస్తారు.

వెనుకబాటు కులాలకు ప్రాధాన్యత కల్పించే దిశగాః
రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాల్లోని పేదలకు విద్య, సంక్షేమం, నివాసం వంటి అంశాల్లో ప్రాధాన్యత కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి జగన్‌ గారు కుల గణన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గత ఏప్రియల్‌ 11వ తేదీన మహాత్మా జ్యోతీభా పూలే జయంతి సందర్భంగా 139 బిసి కులలాతో పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనాటీ వర్గాలు, ఉన్నత వర్గాల్లో పేదరికంలో మగ్గుతున్న కులాల్ని గుర్తించి వారి సంక్షేమం, అభ్యున్నతి ప్రణాళికల రూపకల్పన చేపట్టేందుకు కుల గణన బాధ్యతలను బీసీ మంత్రిగా నాకు అప్పగించారు. ఈ కుల గణన ప్రక్రియ ఈనెల 15వ తేదీ నుండి పవిత్రమైన కార్తీక మాసంలో సమున్నత ఆశయంతో ప్రారంభిస్తున్నాము.

నోడల్ అధికారులుగా జాయింట్‌ కలెక్టర్లు
ఈ కార్యక్రమానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఉన్న ప్రణాళిక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో బీసీ, సోషల్, మైనార్టీ, ఎస్టీ వెల్ఫేర్‌ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు సచివాలయ వ్యవస్థ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు ఇందులో భాగస్వామ్యుల్ని చేశాం. అదేవిధంగా ఇప్పటికే బీహార్‌ రాష్ట్రంలో జరిగిన కుల గణన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపి అక్కడ పరిస్థితులపై సేకరించిన ఒక నివేదికను పరిగణలోకి తీసుకున్నాం. రేపట్నుంచీ జాయింట్‌ కలెక్టర్లు నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తూ ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో వివిధ కులాలకు చెందిన పెద్దలు, మేధావులు, కుల సంఘాల ప్రతినిధులు సంఘాల నేతలు, ప్రతినిధుల నుండి సలహాలు, సూచనలు స్వీకరిసారు. వీటిని కుల గణన కార్యక్రమంలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

5 చోట్ల ప్రాంతీయ సదస్సులుః
కుల గణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నాము. ఈ నెల 17వ తేదీన రాజమహేంద్రవరం, కర్నూలులో, 20వ తేదీన విశాఖపట్నం, విజయవాడలో, 24వ తేదీన తిరుపతిలో ఈ సదస్సులు జరుగుతాయి.

సామాజిక న్యాయానికి చిరునామాగా ఏపీః
రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న నవరత్నాల ప్రాధాన్యతా కార్యక్రమాలతో పేదలకు గౌరవ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాంధవుడిగా నిలిచారు. ప్రస్తుతం చేపట్టిన కుల గణన సమాచారంతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఉన్నత వర్గాల్లోని పేదరికం అనుభవిస్తున్న కులాలకు కూడా సంక్షేమ ఫలాలను అందించేందుకు వీలుకానుంది. అన్ని కులాల సమతా స్థాయిని సాధించి, సామాజిక న్యాయానికి ఆంధ్రపదేశ్‌ చిరునామాగా నిలువబోతోంది. బీసీ సంక్షేమ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్‌ గారి ఆశయ సాధనలో ఆయన వెంట నడుస్తూ ఇలాంటి మహత్తరమైన చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనడం తన అదృష్టం. సమగ్ర కుల గణన కార్యక్రమంలో అన్ని కులాల, వర్గాల ప్రజలు చైతన్యవంతంగా పాల్గొని, ఆదర్శ సమ సమాజ సాధనలో భాగస్వాములు కావాలని మనవి చేసుకుంటున్నాను.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest