ఆత్మగౌరవ పొలికేక భాగ్యరెడ్డి వర్మ

ఆత్మగౌరవ పొలికేక భాగ్యరెడ్డి వర్మ
– చల్లపల్లి స్వరూపరాణి

భాగ్యరెడ్డి వర్మ ఈ దేశం దళితులదని గుండెలమీద చెయ్యేసుకుని దేశం నడిబొడ్డున నిలబడి ఆత్మగౌరవ పొలికేక పెట్టి జాతిని మేల్కొలిపిన దళిత వైతాళికుడు. భాగ్యరెడ్డి వర్మ చారిత్రక దృష్టికి ఈనాటికీ ప్రాసంగికత వుంది. దళితులు యీ దేశపు మూలవాసులని తన ఉపన్యాసాలలో పదేపదే చెప్పే భాగ్యరెడ్డి వర్మ కుల వ్యవస్థకు దన్నుగా పనిచేసేది హిందూ పురాణాలే అని బ్రాహ్మణ వాద సాహిత్యాన్ని దళిత కోణం నుంచి విశ్లేషించాడు. దళితులు ఈదేశంలో ఒకనాటి పాలకులని వారికి గొప్ప చారిత్రక నేపధ్యం, మహోన్నతమైన వారసత్వ సంపద వున్నాయని నమ్మే భాగ్యరెడ్డి వర్మ తనని తాను ఒక రాజుగానే భావించేవాడని అంటారు. ఆయన పూర్వీకులు 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత మిలిటరీలో చేరి మహర్ సైన్యంలో భాగమయ్యారు. అందుకే ఆయనలో ఆ విగర్. ‘సదర్ పంచాయితీ’ అని తెలంగాణాలో పిలిచే దళితుల కుల పంచాయితీ వ్యవస్థ గొప్పదని, అక్కడ న్యాయం, ధర్మం ఉంటాయని దానిని అంతరించి పోకుండా పరిరక్షించాలని చెప్పాడు.

ఆయనకు దేవాలయ ప్రవేశ వుద్యమాల మీద గౌరవం, నమ్మకం లేవు. దేవాలయ ప్రవేశం వల్ల అణగారిన కులాల ప్రజలు తమని అంటరానివారిగా చేసిన హిందూ దేవుళ్ళ కాళ్ళ దగ్గర బానిసలు అవుతారని అది మరింత ప్రమాదకరం అని ఆయన పేర్కొన్నారు. భాగ్యరెడ్డి దళిత జనోద్ధరణకు వారిపరంగా ఒక సాంసృతిక ఉద్యమం కూడా తప్పనిసరిగా ఉండాలని భావించాడు. అందుకే ఆయన హిందూమతాన్ని విడనాడి దళితులు బౌద్ధంలోకి రావాలనే అంబేద్కర్ ప్రతిపాదనను హైదారాబాద్ రాష్ట్రంలో అంబేడ్కర్ కంటే ముందే అమలుపరిచాడు. భాగ్యరెడ్డి వర్మ విగ్రహారాధనను వ్యతిరేకించాడు. ఆయన కబీర్ పంక్తి, నామదేవ్ పంక్తి వంటి బ్రాహ్మణేతర భక్తి ఉద్యమాలకు చెందిన మఠాలను తన ఉద్యమంలో కలుపుకుంటూ హైదరాబాద్ లో ఒక పెద్ద సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాడు.

భాగ్యరెడ్డి ఒకవైపు దళితులలో అంతర్గత సంస్కరణలు చేస్తూనే మరోవైపు వారికి చట్ట సభలలో ప్రాతినిధ్యపు హక్కుల కోసం జాతీయ స్థాయిలో పనిచెశాడు. ఆలిండియా ఆది హిందూ మహాసభలో క్రియాశీలక నాయకుడిగా మారి 1920 నుంచి 1931 వరకు డిల్లీ, అలహాబాద్, నాగపూర్, లక్నోలలో జరిగిన జాతీయ సదస్సులకు దక్షిణ భారత దేశం నుంచి ప్రతినిధిగా భాగ్యరెడ్డి వర్మ పాల్గొని ప్రసంగించారు. వీటిలో 1931 సంవత్సరం సెప్టెంబర్ 27, 28 తేదీలలో జరిగిన లక్నో సదస్సు కీలకమైనది. ఈ సమావేశానికి భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించాడు. ఈ సభలో ఆది హిందువులకు ప్రత్యేక నియోజక వర్గాలు వుండాలని రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకి దేశంలోని తొమ్మిది కోట్లమంది దళితులకు డా. బి.ఆర్. అంబేడ్కర్ ప్రతినిధిగా వ్యవహరిస్తారని సభ తీర్మానించింది.

ఆయన ప్రతిపాదన మేరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ పదివికి జరిగిన ఎన్నికలలో దళితులకు సీటు కేటాయించగా ఆయన అనుచరుడు అరిగే రామస్వామి మొదటి కార్పొరేటర్ గా ఎన్నుకోబడ్డాడు. తర్వాత దశలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బి. ఎస్. వెంకట్రావు, బత్తుల శ్యాం సుందర్, ఎం.ఎల్. ఆదయ్య వంటివారు ఎన్నుకోబడి దళిత ప్రతినిధులుగా క్రియాశీలక రాజకీయాలలో రాణించారు.

భాగ్యరెడ్డి వర్మ చేబట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వాలకు సమర్పించిన ఆర్జీల వలనే మద్రాసు ప్రభుత్వం అప్పటి వరకూ దళితుల పరంగా అధికార పత్రాలలో ఉపయోగించే ‘పంచమ’ అనే పేరును తొలగించి ‘ఆది ఆంధ్ర’ అనే పేరును, దక్షిణాది ప్రాంతాలలో ‘ఆది ద్రావిడ’ అనే పేరును చేరుస్తూ జీ.వో ను జారీ చేసింది.
ఆయన ఆలోచనా విధానాన్ని, లెగసీని కొనసాగించాల్సిన బాధ్యత ఆయన ఉద్యమ వారసులమీద వుంది. ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలకు ఆయన పేరు పెట్టాలి. భాగ్యరెడ్డి వర్మ పేరున యూనివర్సిటీలలో అధ్యయన కేంద్రాలు ప్రారంభించాలి. ఆయన జీవితం, వుద్యమాలపై లోతైన పరిశోధన జరగాల్సి వుంది. తరతరాలుగా చీకటిలో మగ్గిపోయిన అణగారిన ప్రజల ఆత్మగౌరవ పొలికేక మాదరి భాగ్యరెడ్డి వర్మ… ఆయన నింపిన స్ఫూర్తి మనతరాల్ని వెలిగిస్తుంది…

*ఫిబ్రవరి 18(1939) భాగ్యరెడ్డి వర్మ 84వ వర్ధంతి

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest