ఉక్కు సంకల్పానికి రెండేళ్ళు !

విశాఖ

విశాఖ ఉక్కు పరిశ్రమను వ్యూహాత్మకంగా అమ్మకం చేయాలను కేంద్రప్రభుత్వం చేసిన దుర్మార్గపు నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి రెండేళ్లు పూర్తయింది. కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండేళ్లుగా రాష్ట్రంలో పోరాటం సాగుతోంది. రాష్ట్రప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏకగీవ్రంగా తీర్మానం చేసింది. రాష్ట్రప్రజలు పలుసార్లు కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం పదేపదే పార్లమెంటులో విశాఖస్టీల్‌ప్లాంటును అమ్ముతామనిప్రకటనలు చేస్తూనే ఉంది. పోరాట కమిటీ పిలుపు మేరకు సోమవారం 30.01.2023న విశాఖ ఉక్కు పరిశ్రమ వద్ద అఖిలపక్ష పార్టీలతో పోరాట కమిటీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. దీనికి వామపక్ష పార్టీలు సంపూర్ణమద్దతిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పోరాడి సాధించుకున్న భారీ కర్మాగారం… విశాఖస్టీల్‌ ప్లాంట్‌లో ఆనాడు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.5వేల కోట్ల పెట్టుబడిని మాత్రమే పెట్టింది. కానీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పనులు, డివెడెండ్ల ద్వారా రూ.59వేల కోట్లకుపైగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెల్లించింది. విశాఖనగరం అభివృద్ధి కావడానికి కీలకం కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలే. అందులో విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ప్రధమ స్థానంలో ఉంది. 30వేల మంది ప్రత్యక్షంగాను, మరో లక్షమంది పరోక్షంగానూ స్టీల్‌ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యతగల ప్లాంట్‌ను దక్షిణ కొరియాకుచెందిన ‘పోస్కో’ అనే స్టీల్‌ కంపెనీకి, దేశంలోని కార్పోరేట్ దోపిడీ శక్తిగా అవతరించిన అదానీ కంపెనీకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం పట్ల కోట్లాది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు…. చేస్తున్నారు…. చేస్తూనే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం సొంత గనులను సమకూర్చనందునే ప్రతిఏటా రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ 2021-22 సంవత్సరానికి రూ.945కోట్ల లాభాల్లో ఉంది . అయినా కేంద్ర ప్రభుత్వం సొంత గనులను కేటాయించకుండా ప్లాంట్‌ను బలహీనపరిచే కుట్రలను చేపడుతూనే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి తీరనిహాని తలపెట్టడమే. రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని ప్రజానీకం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పక్షాలన్నీ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి రాష్ట్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరిపి చర్చించడం సమంజసమని వామపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖను సైతం రాసాయి. ఈ లేఖపై సిపిఎం(వి శ్రీనివాసరావు), కె రామకృష్ణ(సిపిఐ), వై సాంబశివరావు (సిపిఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీతదితర పార్టీిల నాయకులు సంతకాలను చేశారు.

-సన్నశెట్టి రాజశేఖర్, కన్వీనర్ – ఉత్తరాంధ్ర పోరాట సమితి

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest