ఉగ్రవాదాన్ని అణచివేసే వైఖరి కొనసాగుతుంది : అమిత్‌షా

హైదరాబాద్‌ :

పటిష్ఠ భద్రతతో దేశ ఆర్థిక ప్రగతిలో పారిశ్రామిక భద్రతా బలగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ హకీంపేటలో నిర్వహించిన సీఐఎస్‌ఎఫ్ 54వ రైజింగ్‌ డేకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత భద్రతా బలగాల నుంచి అమిత్‌షా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం, వేర్పాటువాదం సహా దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేసే వైఖరిని రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో హింస గణనీయంగా తగ్గుతూ వస్తోందని, అందుకే ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అమిత్‌షా చెప్పారు. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల సంఖ్య తగ్గడమే కాకుండా లొంగిపోయి జనజీవన స్రవంతిలో వారు కలిసిపోతున్నారన్నారు. రైజింగ్‌ డే సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు ప్రత్యేకంగా ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం దేశవ్యాప్తంగా సీఐఎస్‌ఎఫ్‌ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అమిత్‌షా రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అమిత్‌షా విమానానికి సాంకేతిక లోపం :

అమిత్‌షా ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. హైదరాబాద్‌ నుంచి కేరళలోని కొచ్చికి ఆయన వెళ్లాల్సి ఉంది. విమానంలో సాంకేతికలోపంతో ఉదయం 11.50 గంటల నుంచి హకీంపేట విమానాశ్రయంలోనే అమిత్‌షా నిరీక్షిస్తున్నారు. విమానం బయల్దేరేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. పర్యటన ఆలస్యం కావడంతో రాష్ట్ర రాజకీయాలపై అమిత్‌షా చర్చించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌తో ఆయన మాట్లాడారు.

సీఐఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే పరేడ్‌ : హైదరాబాద్‌ హకీంపేట్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest