కాంగ్రెస్ తో బీఎస్పీ లోపాయికారి ఒప్పందం ?

హైదరాబాద్, 01 అక్టోబర్ 2023 :

తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో బహుజన్ సమాజ్ పార్టీ ( బి ఎస్ పీ ) లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్టు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే బి ఎస్ పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నట్టు బహుజన వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజానికి అలంపూర్ లో ప్రవీణ్ పోటీ చెయ్యాలని ముందుగా భావించాడట. కానీ అలంపూర్ లో ప్రస్తుత బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అబ్రహం, మాజీ ఎమ్మెల్యే సంపత్ , ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడంతో బి ఎస్ పీ ఈ రెండు పెద్ద పార్టీలను తట్టుకుని గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ప్రవీణ్ కుమార్ సిర్పూర్ పై నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. కారణం సిర్పూర్ నియోజకవర్గంలో ఎస్సిల ఓట్లు అత్యధికంగా ఉండటమే. అయితే ఎస్సి ల్లోనూ ప్రవీణ్ కుమార్ సామజిక వర్గానికి చెందిన ఓట్లు చాలా తక్కువ ఉంటాయి. కానీ నేతకాని, మహార్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సామజిక వర్గాల్లో అంబేద్కర్ భావజాలం నరనరాన నిండి ఉంటుంది. ఎస్సి సామజిక వర్గాల్లోని ఇతర కులాలతో పోల్చుకుంటే మహార్, నేతకాని ఈ రెండు సామజిక వర్గాలు అంబేద్కర్ భావజాలం మాత్రమే నమ్ముకుని ఉంటారు. అందుకే 2014 లో అగ్ర కులానికి చెందిన కోనేరు కోనప్ప బి ఎస్ పీ నుంచి పోటీ చేసిన కేసీఆర్ గాలిలో కూడా సిర్పూర్ లో బీఎస్పీ గెలిచింది. ఇక్కడ ఈ రెండు సామజిక వర్గాల ఓట్లు బలంగా ఉంటాయి కాబట్టి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని బి ఎస్ పీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రవీణ్ కుమార్ పర్యటిస్తున్నారు.


అయితే సిర్పూర్ లో ప్రస్తుత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బలమైన నాయకుడే. బీజేపీ లో ఉన్న పాల్వాయి సతీష్ బాబు కూడా బలమైన నాయకుడే. సతీష్ బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తం రావు స్వతంత్ర అభ్యర్థిగానే ఎమ్మెల్యేగా అప్పట్లోనే గెలిచారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడు లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు సిర్పూర్ లో కాంగ్రెస్ పార్టీకి నాయకుడే లేదు. కాబట్టి ప్రవీణ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ లోపాయికారి మద్దత్తు ఇస్తే ప్రవీణ్ కు ప్రయోజనం ఉంటానని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈ ఒక్క నియోజకవర్గం వరకు కాంగ్రెస్, బి ఎస్ పీ లోపాయికారి ఒప్పందం కుదిరిందని ఆయా పార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారే కావడంతో ఈ ఒప్పందానికి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest