కాంగ్రెస్ నేతల బృందంతో గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

 

హైదరాబాద్:

కాంగ్రెస్ నేతల బృందంతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘టీఎస్పీఎస్సీ ఘటన చాలా పెద్దది.. సీరియస్‌గా తీసుకుంటాం’ అని గవర్నర్ తమిళిసై స్పష్టంగా చెప్పారు. ప్రతిరోజూ ప్రభుత్వం, ప్రతిపక్ష నేతల కామెంట్స్ చూస్తున్నానని, రేవంత్‌రెడ్డి కామెంట్స్‌ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నా, బాగా మాట్లాడుతారని తమిళిసై తెలిపారు. అంశంపై యాక్షన్ తీసుకోవాలని, విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కోర్టులో కేసు వేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వల్ల లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసైని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులదే కీలకపాత్రని ఆరోపించారు. కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్‌కు అప్లికేషన్ పెట్టామన్నారు. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చామన్నారు.

ఇప్పుడున్న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అందరినీ సస్పెండ్ చేసి.. పారదర్శక విచారణ చేస్తారని భావించామని.. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉందన్నారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని విమర్శించారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest