కాంగ్రెస్ సభకు పోతే పోడు భూములకు పట్టాలు రావని బెదిరిస్తున్నారు

ఇల్లందు

“కాంగ్రెస్ సభకు వెళితే పోడు భూములకు పట్టాలు రావని బెదిరిస్తున్నారు. బిడ్డా పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తాం. అర్హులైన వారికి పోడు భూములకు పట్టాలిచే వరకు కాంగ్రెస్ మీకు అండగా ఉంటుంది” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా 6వరోజు ఇల్లందు ప్రాంతంలో దాదాపు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఇల్లందు జగదాంబ సెంటర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రాంతం సింగరేణికి పుట్టినిల్లు. సింగరేణి కార్మికుల సమస్యలకు కేసీఆరే కారణం. పాదయాత్రలో కలిసిన గిరిజన టీచర్లు ప్రమోషన్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోడు భూములపై సీతక్క మాట్లాడితే అసెంబ్లీలో కేసీఆర్ రంకెలేశారు. ఎక్కడికెళ్లినా ఆదివాసీ, గిరిజనులు పోడు భూముల సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. 2024, జనవరి 1 న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అర్హులైన అందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తామని భరోసా ఇస్తున్నాం. దీంతో ప్రజలకు కాంగ్రెప్ పార్టీపై నమ్మకం కలుగుతుందని కేసీఆర్ కు గుబులు పుట్టింది. గిరిజనులు, ఆదివాసులు కాంగ్రెస్ కు అండగా ఉంటున్నారని…. పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించిండు. ఇవాళ కేసీఆర్ ప్రకటనను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా హరితహారం పేరుతో వేల ఎకరాలను గుంజుకుంది. పోడు భూముల గురించి ప్రశ్నిస్తే మంచిర్యాల, నిర్మల్ ప్రాంతంలో మహిళలపై దాడి చేయించి చంటిపిల్లలతో సహా కేసులు పెడితే సీతక్క వారికి అండగా నిలిచింది. తాడ్వాయి అడవుల్లో అడబిడ్డలను చెట్లకు కట్టేసి కొడితే మేం వెళ్లి అండగా నిలిచాం. 2014 నుంచి తొమ్మిదేళ్లుగా పోడు భూములకు ఎందుకు పట్టాలివ్వలేదు? అసెంబ్లీని అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ సభకు వెళితే పోడు భూములకు పట్టాలు రావని బెదిరిస్తున్నారు. బిడ్డా పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తాం పట్టాలు ఇవ్వకుంటే అడవుల్లోకి ఓట్లు అడగడానికి వస్తే.. మీపై తిరగబడటం ఖాయం. తాడ్వాయి అడవుల్లో మాదిరిగా బీఆర్ఎస్ నాయకులను చెట్లకు కట్టేసి పట్టాలు ఇచ్చిన తర్వాతనే వదులుతాం. కేసీఆర్.. మా గిరిజనులు నీ వెయ్యి ఎకరాలలోని ఫామ్ హౌస్లో గుంట భూమి ఆడిగారా? నీ బ్యాంకులో ఉన్న కోట్లలో చిల్లిగవ్వ ఆడిగారా? అర్హులైనవారికి 11 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచే వరకు కాంగ్రెస్ మీకు అండగా ఉంటుంది. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతు అన్నడు. బోయలు వాల్మీకీలను ఎస్టీల్లో కలుపుతా అన్నడు. తొమ్మిదేళ్లు పోయింది. తెలంగాణ మొట్టమొదటి శాసనమండలి వాల్మీకిబోయ గట్టు భీముడిని ఎమ్మెల్సీగా పంపిస్తా అన్నాడు. చూసిచూసి భీముడు దేవుడికి దగ్గరికి పోయాడు. వాల్మీకి బోయలు నిన్ను నమ్మే పరిస్థి లేదు. పిట్టను గురి పెట్టి కొట్టినట్లు బోయలు కేసీఆర్ ను గురి పెట్టి ఓడించడం ఖాయం. 1/70 యాక్ట్ అమలు చేస్తున్న ప్రాంతంలో జీవో నెంబర్ 3 ప్రకారం గిరిజన టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు నిర్మించలేదు. కేసీఆర్ తో కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలొనే అది బయ్యారం కలు సాకారం అవుతుంది. 2024, జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం అందిస్తాం. రూ. 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతును ఆదుకుంటాం. ప్రతీ పంటను ప్రభుత్వమే కొని దళారి వ్యవస్థను పాతర వేసే బాధ్యత కాంగ్రెస్ ది. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. పేదలకు, కష్టాల్లో ఉన్న వారికి అభయం ఇచ్చే హస్తం కాంగ్రెస్. అభయ హస్తం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సింగరేణిని ప్రయివేటుపరం కానిచ్చే ప్రసక్తే లేదు
అంతకుముందు జవహర్ గనిని సందర్శించి కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. రెగ్యులర్ కార్మికులను తొలగించి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి గని కార్మికుల పాత్ర ఎంతో ఉంది. ఒకప్పుడు 80 వేలు ఉన్న ఉద్యోగులు 40వేలకు తగ్గిపోయారు. కమీషన్ల కక్కుర్తి కోసం ఓపెన్ కాస్ట్ గనులను ప్రయివేటుకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సింగరేణిని ప్రయివేటు పరం చేయొద్దని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశాము. సింగరేణి గనులను ప్రయివేటుకు కట్టబెట్టి రూ. 25 వేల కోట్లు దోపీడికి పాల్పడాలని చూస్తే దాన్ని అడ్డుకున్నాం. సింగరేణిని ప్రయివేటుపరం కానిచ్చే ప్రసక్తే లేదు. సింగరేణిని కాపాడేందుకు కావాల్సిన అన్ని చర్యలు కాంగ్రెస్ తీసుకుంటుంది. ప్రయివేటైజేషన్ కు వ్యతిరేకం అంటూనే మైన్స్ ను ప్రయివేటుకు అప్పగిస్తున్నారు. ఇందుకు కేసీఆర్ పరోక్షంగా మోదీకి సహకరిస్తున్నారు. సింగరేణికి జెన్ కో 12 వేల కోట్ల బకాయి పడింది. అందుకే సింగరేణిలో కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. సింగరేణి సంస్థల్లో అన్ని అక్రమాలకు కారణం సీఎండీ శ్రీధర్. రెండు మూడేళ్లు మాత్రమే ఆ స్థానంలో ఉండాల్సిన శ్రీధర్ ఏళ్లు గడుస్తున్నా సీఎండీగా కొనసాగుతున్నారు. ఓపెన్ కాస్ట్ మైన్ తో కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. 10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సింగరేణిలో దోపిడీకి పాల్పడిన వ్యక్తులను కటకటాల్లోకి పంపిస్తాం. గతంలో ఇలాంటి పనులు చేసిన ఐఏఎస్ అధికారుల పరిస్థితి ఏమైందో సీఎండీ శ్రీధర్ గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ తొలి సంతకం చేస్తాం. అండర్ గ్రౌండ్ మైన్ లు ఓపెన్ చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. కార్మికుల సమస్యలు కాంగ్రెస్ పరిష్కరిస్తుంది. ఈ దండకారణ్యంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాల అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest