”కాకి” చుట్టు అల్లిన జీవితం ”బలగం” (PREVIEW)

( లక్ష్మి నారాయణ .మసాదే )

”కాకి” కథలు చాలా వింటుంటాం. కానీ ”కాకి” చుట్టూ మానవీయ విలువలను, కుటుంబ అనుబంధాలను, మానవత్వపు మమకారాన్ని కలగలిపి ఓ జీవితాన్ని ఆవిష్కరించిన సినిమా ”బలగం”. కమెడియన్ వేణు కన్నీళ్లు పెట్టించాడు. ”బలగం” సినిమాలో ”కథే” బలం. జీవితంలో చాలా సినిమాలు చూస్తుంటాం. కానీ అప్పుడప్పుడు జీవితాన్ని తెరమీద చూసే అవకాశం దొరుకుతుంది. అలాంటి అవకాశమే ”బలగం”. ఈ కథను ఆలోచించినందుకు, ”కాకి” చుట్టూ కథను అల్లుకున్నందుకు దర్శకుడు వేణు, ఈ కథను తెరకెక్కించిన నిర్మాత దిల్ రాజు కు హాట్సాఫ్.

”కాకి చుట్టూ తిరిగే కొమురయ్య కథ….కొమరయ్య చుట్టూ తిరిగే కాకి కథ ”. ఎలా చెప్పినా కాకికి మనిషికి ఉన్న గొప్ప మానవీయ సంబంధాన్ని హృదయాలకు హత్తుకునేలా కథనాన్ని నడిపించిన దర్శకుడి ప్రతిభకు పట్టం కట్టాల్సిందే. డైరెక్టర్ వేణు తెలివికి జేజేలు కొట్టాల్సిందే.

కొమరయ్య  లాంటి తాత దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటాడు. తెల్లవారాక ముందే వచ్చి నిద్ర లేపితే ”పొద్దున్నే ఎందుకు కాకిలా అరుస్తావ్” అని తాతపై కోప్పడుతుంటాం. కానీ అలాంటి తాత ఇక కనిపించడు అని మనవడు ఏడిస్తే క్లైమాక్స్ లో థియేటర్ లో కూర్చున్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. కొమురయ్య 11వ రోజు బుర్రకథ లో కుటుంబ గౌరవ మర్యాదలు, బిడ్డల ఆలనాపాలనా, మనుషుల మధ్య ఉండాల్సిన విలువలు, బంధాలు, బాంధవ్యాలు, అన్నదమ్ములు, అన్న చెల్లెల మధ్య ఆప్యాయతల గురించి చెబుతున్న సమయంలో అల్లిన ఆ సన్నివేశాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి. కన్నీళ్లు పెట్టించాయి.

”నాకు ఎలాంటి మొగుడొస్తాడో నేను ఎన్నేళ్లు ఇంటికి దూరంగా ఉండాలో” అంటూ కూతురు చెప్పిన డైలాగు తండ్రి ”ఇగో” ను ప్రశ్నిచింది. ”పెద్ద కర్మ పోస్టర్ ను చేతబట్టుకుని తాతతో నువ్వు కలిసి ఉన్నావు బావ నాకు కనీసం తాత అని పిలుచుకునే అవకాశం కూడా లేదు” అనే డైలాగు చెప్పిన హీరోయిన్ లాంటి క్యారెక్టర్స్ తెలంగాణ పల్లెల్లో చాలానే ఉంటాయి. ఈ సినిమాలో హీరోయిన్ కు పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయినా హీరోయిన్ క్యారెక్టరే ఈ కథకు ఆయువుపట్టు. ఎందుకంటే మూడో రోజు, ఐదో రోజు కూడా కాకి ”అన్నం” ముట్టకపోయేసరికి లక్ష్మి కూతుర్ని సాయిలుకు ఇచ్చి పెళ్లి చేద్దామని కొమురయ్య అన్నాడు అని ఆయన తమ్ముడు చెప్పిన తరువాత నుంచే కథ మలుపు తిరుగుతుంది.

”బలగం” సినిమాలో అందరూ కొత్తవాళ్లే. ఎవరి పాత్రకు వారూ పూర్తిగా న్యాయం చేశారు అనడం కన్నా ఎవరి పాత్రలో వారు జీవించారని అంటేనే బాగుంటుంది. కొమురయ్య కూతురు లక్ష్మి పాత్రను పోషించిన నటి, కొమురయ్య చెల్లెలు పాత్రను పోషించిన ముసలమ్మ ఈ రెండు పాత్రలు చాలా కీలకం. ఈ రెండు పాత్రల్లో నటించిన నటీమణులు ఆ పాత్రలకు జీవం పోశారు.

ఇక దర్శకుడు వేణు స్వతహాగా కమెడియన్ కాబట్టి తన కామెడీ మార్కును కూడా వదిలిపెట్టలేదు. టైలర్ నర్సి పాత్రను పోషించిన వేణు రెండు నిముషాలు ఆగుతావా అంటూ రచ్చ రవి చేసే మేనరిజం సీన్స్ సూపర్ గా ఉంటాయి.

భీమ్స్ అందించిన సంగీతం, ఆర్ ఆర్ మ్యూజిక్ చాలా బాగుంది. అయితే మంగ్లీ పాడిన పాట , రామ్ మిర్యాల పాడిన పాటలను కూడా తెలంగాణ గాయని గాయకులతో పాడిస్తే ఇంకా బాగుండేది . ఎందుకంటే రామ్ మిరియాల పాట పాడుతుంటే అతని వాయిస్ లో ఎక్కడో ఆంధ్ర యాస వినిపిస్తుంది. అది ఈ సినిమాకు సెట్ అవ్వలేదు. ఎందుకంటే రామ్ మిర్యాల పాడిన పాట వింటుంటే జాతి రత్నాలు సినిమాలోని చిట్టిని నవ్వుంటె పాట పాడినట్టే ఉంది. ఈ సినిమా పాడినప్పుడు ఆ పాట గుర్తుకు రాకూడదు. కాబట్టి ఈయన వాయిస్ ఈ సినిమాకు సరిపోలేదని అంటున్న.

ఈ సినిమాకు పాటలు రాసిన కాసర్ల శ్యామ్ సాహిత్యానికి పేరు పెట్టాల్సిన పనిలేదు. బలరామ నర్సయ్య అనే పాట సాహిత్యం కావొచ్చు, పాడిన గాయకుడి విధానం కావొచ్చు చాలా బాగుంది.

ఇది ఫక్తు తెలంగాణ పల్లె జీవిత కథ. ఈ పల్లె పాటలను కూడా తెలంగాణ గాయని గాయకులచేత పాడించి ఉంటె ఇంకా బాగుండేది. దిల్ రాజు ప్రొడక్షన్ ఉన్నతమైన విలువలతో ఇలాగే ఉన్నతమైన సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest