గండ్ర అవినీతినిపై విచారణకు సిద్ధమా?కేటీఆర్ కురేవంత్ సవాల్

భూపాలపల్లి

“ఇవాళ నా మీటింగ్ ఉందని రేపు డ్రామారావును తీసుకొస్తున్నారు. రాజీవ్ విగ్రాహం సాక్షిగా  సవాల్ విసురుతున్నా.. నీ ఎమ్మెల్యే ఆక్రమించున్న భూములపై విచారణకు సిద్ధమా? మీ ఎమ్మెల్యే అక్రమ ఆస్తులపై విచారణకు సిద్ధమా? సింగరేణి నిధుల దోపిడీపై విచారణకు సిద్ధమా? ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అవినీతిపై చర్చకు మేం రెడీ.. బహిరంగ చర్చకు డ్రామారావు సిద్ధమా? మీ ఎమ్మెల్యే అవినీతిని నిరూపించేందుకు మేము సిద్ధమా” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు సవాలు విసిరారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలో తిరుమలాపూర్ గ్రామం నుంచి మొగుళ్లపల్లి బస్టాండ్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడే నిర్వహించిన జనసభలో ప్రసంగించారు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతం ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక. రాణిరుద్రమదేవి, విస్నూరు దొరల మీద తిరుగబాటు చేసిన చాకలి ఐలమ్మ వంటి వారు నడిచిన నేల ఇది. అలాంటి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. పాదయాత్రలో ఎవరిని కదిలించిన కష్టాలే కనిపిస్తున్నాయి. యువకులు ఉద్యోగాలు రాలేదని, రుణ మాఫీ కాలేదని రైతులు వాపోయారు. ఈ తొమ్మిదేళ్లలో ఏ అభివృద్ధి జరగలేదు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు రిజర్వేషన్లు, గిరిజనులకు రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, నిరుద్యోగభృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుకు రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు..ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదేళ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కానీ కేసీఆర్, ఆయన బంధువులకు విలాసవంతమైన జీవితం వచ్చింది. వాళ్ల ఆస్తులు పెంచుకున్నారు.. తప్ప.. తెలంగాణకు చేసిందేం లేదు. ఉద్యమ సమయంలో రబ్బర్ చెప్పులతో తిరిగిన కేసీఆర్ కు హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాల భూములు, రాసుకోవడానికి పేపర్లు, చూసుకోవడానికి టీవీలు వచ్చాయి. ధరణి తెచ్చిర్రు దందాలు మొదలు పెట్టారు. పేదల భూములు కబ్జాలు చేసి.. ఈ ఎమ్మెల్యే పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటుండట. నక్సలెట్ల ఏజెండా నా ఏజెండా అని కేసీఆర్ అన్నారు. కొడుక్కి, కూతురికి, అల్లునికి, సడ్డకుని కొడుక్కి, ఉద్యమ ద్రోహి ఎర్రబెల్లికి, సుట్టపోడు వినోద్ కుమార్ కు పదవులు ఇవ్వాలని ఏ నక్సలైట్ ఏజెండాలో ఉంది. ధరణి తేవాలని, హరితహారం కింద గిరిజనుల భూములు గుంజుకోవాలని ఏ నక్సలైట్ ఏజెండాలో ఉంది. పోడు భూములపై ప్రశ్నించిన గిరిజనులను చెట్టుకు కట్టేసి కొట్టాలని ఏ నక్సలైట్ ఏజెండాలో ఉంది. కాంగ్రెస్ ఏం చేసిందా..నిన్ను ఎమ్మెల్యేను చేసింది, చీఫ్ విప్ చేసింది, నీ ఆస్తి అంతా కాంగ్రెస్ పార్టీలోనే సంపాదించుకుంది. నీవు గెలిచి వందల కోట్లకు అమ్ముడు పోయ్యావు. ఆ గెలుపులో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం లేదా. ఈ ఒక్కడే కాదు డర్టీ డజన్ మంది ఎమ్మెల్యు ఉన్నారు. పార్టీ పిరాయించిన ఆ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగిలి నాశనమై పోతారు. ఇవాళ నా మీటింగ్ ఉందని రేపు డ్రామారావును తీసుకొస్తున్నారు. రాజీవ్ విగ్రాహం సాక్షిగా డ్రామారావుకు సవాల్ విసురుతున్నా.. నీ ఎమ్మెల్యే ఆక్రమించున్న భూములపై విచారణకు సిద్ధమా? మీ ఎమ్మెల్యే అక్రమ ఆస్తులపై విచారణకు సిద్ధమా? సింగరేణి నిధుల దోపిడీపై విచారణకు సిద్ధమా? ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అవినీతిపై చర్చకు మేం రెడీ.. బహిరంగ చర్చకు డ్రామారావు సిద్ధమా? మీ ఎమ్మెల్యే అవినీతిని నిరూపించేందుకు మేము సిద్ధం. హైదరాబాద్లో నడి రోడ్డుపై చిన్నారి కుక్కలు కరిచి చనిపోతే మంత్రి కేటీఆర్ సారీ చెప్పి చేతులు దులుపుకున్నారు. పేదోడి కడుపుకోత నీకు తెలుసా కేటీఆర్..బీఆరెస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా? కనీస మానవత్వం లేని మీరు మనుషులా రాక్షసులా? మన జీవితాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించండి. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోవాలి. పేదల రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. అది జరగాలంటే ఈ భూపాలపల్లి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ పేదోడు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలకు ఇస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి.
———————————-
కుక్కలకు ఆకలేసి బాలుడిని తిన్నాయా? : రేవంత్ రెడ్డి

యాత్ర ప్రారంభానికి ముందు కోటంచ లక్ష్మీ నర్సింహ స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో నాలుగేళ్ల బాలుడిని కుక్కలు దాడి చేసి చంపిన ఘటనపై స్పందించారు. కుక్కల దాడిలో బాలుడు చనిపోతే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కుక్కలకు ఆకలేసి బాలుడిని తిన్నాయని మేయర్ చెబితే, మంత్రి కేటీఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామని చెబుతున్నారని, చనిపోయిన బాలుడు కుటుంబాన్ని ఆదుకోవాలనే విషయాన్ని మరిచిపోయారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేయర్, మంత్రుల వ్యాఖ్యలు చూస్తే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం అవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బాలుడు కుటుంబాన్ని పరామర్శించి వారిని ఆదుకోవలసిన మంత్రి కేటీఆర్ ఆ విషయం పక్కనపెట్టారన్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తామని చెప్పడంతో ఆయన మెదడు ఎక్కడ ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసులను దృష్టిలో పెట్టుకుని ఎఫ్ వన్ రేసులపై ఉన్న శ్రద్ధ కుక్కలు పెడితే లేదా అంటూ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తక్షణం మృతి చెందిన బాలుడు కుటుంబాలకు క్షమాపణ చెప్పి, ఆ కుటుంబాన్ని పరామర్శించి వారిని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. భూపాలపల్లి లో పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే గండ్ర పేదల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రేపు భూపాలపల్లి లో పర్యటించే మంత్రి కేటీఆర్ దీనిపైన విచారణకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆక్రమణలను, అక్రమ దందాను నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

————————————–
మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ పుణ్యమే : చిట్యాల మాట ముచ్చట కార్యక్రమంలో రేవంత్
వంటింటికే పరిమితమైన మహిళలకు డ్వాక్రా సంఘాలు పెట్టి ఆర్థికంగా నిలబడేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యాత్ర ఫర్ ఛేంజ్ లో భాగంగా బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల వద్ద మహిళలతో నిర్వహించి మాట ముచ్చట కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మహిళలకు రాజకీయంగా రిజర్వేషన్ ఉండాలని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇవాళ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయంటే అది కాంగ్రెస్ తెచ్చిందే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంది.
నరేంద్ర మోదీ మహిళా ద్వేషి. 2014లో మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించకుండా కేసీఆర్ మహిళలను అవమానించారు. 2019లో నిజామాబాద్ లో ప్రజలు కేసీఆర్ బిడ్డను ఓడించి ఇంటికి పంపితే అప్పుడు తెలివి వచ్చి మహిళలను మంత్రులను చేశాడు. కానీ వారు నిమిత్తమాత్రులు.. వారికి నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా చేశారు. పెన్ ఉంది కానీ ఇందులో ఇంక్ లేదు. రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపులను కేసీఆర్ నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో 10 వార్డులంటే 20 బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. సున్నా వడ్డీకి రుణాల జాడే లేదు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటేనే పేదల బతుకులు బాగుపడతాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ పేదోడు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలకు ఇస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. రూ.500కే సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ ది. మహిళా సంఘాల బలోపేతం కోసం కాంగ్రెస్ రూపొందించే ప్రణాళికను ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చే బాధ్యత మాది. హైదరాబాద్ లో నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు కరిచి చంపేశాయి. ఆ బాలుడి కుటుంబాన్ని పరామర్శించే సంస్కరం మున్సిపల్ శాఖ మంత్రికి లేదు. పేదలు చనిపోతే ఆదుకోవాల్సిన మంత్రి ఎఫ్ 1 రేసులు అంటూ సినిమా తారలతో, పెట్టుబడిదారులతో తిరుగుతున్నాడు. రాష్ట్రంలో మహిళలకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. మీ రాజ్యం మీ చేతిలో ఉంది. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో మహిళలతో సమావేశం ఏర్పాటు చేసే కార్యాచరణ తీసుకుంటాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి మహిళా శక్తిని చాటండని రేవంత్ రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest