ఘ‌నంగా ప్ర‌పంచ అట‌వీ దినోత్స వేడుక‌లు

 

నిర్మ‌ల్ :

మానవ మనుగడలో అడవుల పాత్ర ఎంతో కీలకమైందని,. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని తెలియజేయడం కోస‌మే ప్రపంచ అటవీ దినోత్సవం ముఖ్య ఉద్దేశమ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.
ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో అడవుల ఆవశ్యకత తెలుపుతూ అట‌వీ శాఖ ఆద్వ‌ర్యంలో నిర్వహించిన ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా అట‌వీ శాఖ కార్యాల‌యం నుంచి ప్రొఫెస‌ర్ జ‌యశంక‌ర్ సార్ చౌర‌స్తా వ‌ర‌కు ఈ ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం గండిరామ‌న్న హ‌రిత‌వ‌నంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మొక్క‌లు నాటారు. త‌ర్వాత పార్క్ లో మంత్రి సైక్లింగ్ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య‌వంత‌మైన ప్ర‌జ‌ల‌కోసం అడ‌వులు*అనే ఇతివృత్తంతో ప్ర‌పంచ అట‌వీ దినోత్స‌వాన్ని జ‌రుపుకోవాల‌ని ఐక్య‌రాజ్య స‌మితి పిలుపునిచ్చిందని, అయితే రానున్న తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో సీం కేసీఆర్ గారు జంగల్ బచావో – జంగల్ బడావో నినాదంతో 2015 సంవత్స‌రంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. అనుకున్న ల‌క్ష్యాన్ని అధిగ‌మించి ఎనిమ‌ది ఏండ్లలోనే 273 కోట్ల‌కు పైగా మొక్క‌లు నాటామని తెలిపారు. తెలంగాణలో 2015 నుంచి 2021 సంవ‌త్స‌రాల మ‌ధ్య పచ్చదనం శాతం 7.70% పెరిగింద‌ని, మ‌రోవైపు తెలంగాణ ప్రభుత్వం అడవుల పరిరక్షణ కోసం తీసుకొన్న చర్యల ఫలితంగా వన్యమృగాల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందింద‌ని, క‌వ్వాల్, అమ్ర‌బాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ప్రాంతాల్లో పులుల సంఖ్య పెరిగింద‌ని వెల్లడించారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తడోబా-అంధేరి టైగర్‌ రిజర్వ్‌
నుంచి పులులు మ‌న అవ‌సాల‌కు వ‌స్తున్నాయ‌ని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కవ్వాల్‌ టైగర్‌జోన్‌తో పాటు, ప్రాణాహిత, పెన్‌గంగ సరిహద్దు ప్రాంతాల్లో పులుల సంచారం బాగా పెరిగిందని చెప్పారు.
అడవులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవులను నరికి వేస్తే భవిష్యత్ కాలంలో దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి అడవులను కాపాడుకోవాలని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. పర్యావరణ ప‌రిరక్షణకు విద్యార్థుల్లో అవగాహన పెరగటం చాలా అవసరం అని, తద్వారా వారు మిగతా సమాజానికి సంధానకర్తల్లా పనిచేస్తారని అన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ వ‌రుణ్ రెడ్డి, జిల్లా అట‌వీ శాఖ అధికారి సునిల్ హిరామ‌త్, ఇత‌ర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest