టి కాంగ్రెస్ లో వారసుల తుఫాన్

హైదరాబాద్ :

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. టీ కాంగ్రెస్ లో పలువురు సినీయర్లు తమ వారసులకు టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూన్నారు. టీ కాంగ్రెస్ లో తెరపైకి వచ్చిన వారసులు ఎవరు? ఆ వారసులను ఎక్కడి నుండి ఆ నేతలు రంగంలోకి దించబోతున్నారు? ఆ వారసుల పోటీకి కాంగ్రెస్ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల వారసులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.ఇప్పటి నుండే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ క్యాడర్ కు సంకేతాలు ఇస్తున్నారు.దానికి అనుగుణంగానే తమ వారసులను పోటీలో దించాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఆయా సీనియర్ నేతలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.ఇప్పటికే అధిష్టానం చెంతకు ఆ నేతలు తమ వారసుల విషయంలో తాము తీసుకున్న నిర్ణయాలను తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే టీ కాంగ్రెస్ లో వచ్చే ఎన్నికల్లో బరిలో దిగడానికి సిద్దంగా వున్న వారసుల లిస్ట్ పెద్దగానే వుంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది వారసులు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. తనయుడు రగువీర్ కి మిర్యాలగూడ టికెట్ ఇప్పించేందుకు సి ఎల్ పీ మాజీ నేత జానారెడ్డి ట్రై చేస్తున్నారు. ఇదే బాటలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. సీతక్క కుమారుడు సూర్య కు పినపాక టికెట్ కోసం ఆమె అడుగుతున్నారు. జగ్గారెడ్డి తన కుమార్తె జయా రెడ్డిని మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయించే ఆలోచనలో వున్నారు.ఇప్పటికే జయారెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ జగ్గారెడ్డి వారసురాలిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇక కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ కుమారుడు సాయి శంకర్ నాయక్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.ఇప్పటికే యూత్ కాంగ్రెస్ నాయకుడిగా వున్న సాయి శంకర్ నాయక్ మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుండి లేదా ఇల్లెందు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ వచ్చే ఎన్నికల్లో పరకాల,లేదా వరంగల్ తూర్పు నుండి పోటీ చేసేందుకు ఇప్పటి నుండే పావులు కదుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష సైతం తన తండ్రి వారసురాలిగా మెదక్ పార్లమెంటు లేదా ఆందోల్ అసెంబ్లీ స్తానం నుండి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కుమారుడు దీపక్ వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి లేదా అలంపూర్ నుండి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారట.

మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పెద్ద కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే రాజకీయాల్లో కొనసాగుతుండగా చిన్న కుమారుడు అరవింద్ యాదవ్ సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి బరిలో వుండేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి గీతారెడ్డి కుమార్తె మేఘన వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి లేదా మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కొడంగల్ నియోజకవర్గం బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. దీనితో రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి కాకుండా వేరే నియోజకవర్గం నుండి పోటీ చేస్తే కొడంగల్ నుండి తిరుపతి రెడ్డి బరిలో వుంటారని..లేకపోతే నారాయణపేట లో పోటీ లో ఉంటారని ప్రచారం జరుగుతోంది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల కోడలు వైశాలి.. జనగమ, పాలకుర్తి టికెట్ రేస్ లో వున్నారు

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest