తెలంగాణ సెంటిమెంట్ లేక KCR విలవిల?

  • తెలంగాణ సెంటిమెంట్ తోనే ముఖ్యమంత్రి అయిన కేసీఆర్
  • 2018 ఎన్నికల్లోనే బాబుపై గురి పెట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టిన కేసీఆర్
  • బి ఆర్ ఎస్ గా మారడంతో ఎన్నికల్లో కలసిరాని సెంటిమెంట్
  • కర్ణాటక సెంటిమెంట్ తో జనం లోకి కేటీఆర్

హైదరాబాద్, 14 నవంబర్ 2023 :

సెంటిమెంట్ లేక బి ఆర్ ఎస్ విలవిలా!

హైదరాబాద్, 14 నవంబర్ 2023 :

భారత రాష్ట్ర సమితి (బి ఆర్ ఎస్ ) కు ఇప్పుడు అర్జంట్ గా ఓ సెంటిమెంట్ కావాలి. అదీకూడా తెలంగాణ స్ట్రాంగ్ సెంటిమెంట్ అయి ఉండాలి. గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తోనే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి కావలసిన సెంటిమెంట్ దొరక్క విలవిలలాడుతున్నారు. కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే ఎన్నికల్లో కలసివస్తుంది తప్ప మరే ఇతర సెంటిమెంట్ కలసిరాదనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఈ ఎన్నికల్లో అలాంటి సెంటిమెంట్ లేక బి ఆర్ ఎస్ నేతలు ఇబ్బంది పడుతున్నారు. టి ఆర్ ఎస్ ను బి ఆర్ ఎస్ గా మార్చినప్పుడే చాలా మంది బయట చెప్పకపోయినా మనసులో కేసీఆర్ పై వ్యతిరేకతను దాచుకున్నారు. ఇప్పుడు జనంలోకి వెళ్ళడానికి ఏ సెంటిమెంట్ కూడా అందుబాటులో లేకపోవడం, మరో పదిహేను రోజుల్లో ఎన్నికలు జరుగనున్నడంతో గులాబీ నేతల విజయావకాశాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఒకపక్క డెబ్భై ఏళ్ళ వయసులో కూడా కేసీఆర్ రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్నాడు. తాను వెళ్లే హెలి క్యాప్టర్ అప్పుడప్పుడు మొరాయించిన వాహనాల్లో బైరోడ్డు నుంచి వెళ్లిమరీ సభలో పాల్గొంటున్నాడు. మరోపక్క కె టి ఆర్, హరీష్ రావు, కవిత వాళ్ళ వాళ్ళ స్థాయిలో అవసరం ఉన్న చోట ప్రచారానికి వెళ్తూనే ఉన్నారు. అయినా పోటీ చేస్తున్న నేతల్లో ఎక్కడో ఒక చోట గుండెల్లో భయం కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

రెండు ఎన్నికలు తెలంగాణ సెంటిమెట్ తోనే !
2014 ఎన్నికలు తెలంగాణ సెంటిమెంట్ మీదనే నడిచాయి. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ అప్పటి టి ఆర్ ఎస్ కె ఇక్కడి ప్రజలు అధికారం కట్టబెట్టారు. దీంతో 2014 లో కె. చంద్రశేఖర్ రావు తొలి సారిగా తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే పూర్తిగా ఐదేళ్లు పరిపాలించక ఆరునెలలు ముందస్తుగానే తిరిగి ఎన్నికలకు వెళ్లారు. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ సర్కారు పై కొంత వ్యక్తిరేకత వచ్చినా , తెలంగాణ కాంగ్రెస్ లో సరైన నాయకత్వం లేకపోవడం కేసీఆర్ కు అనుకూలమైన వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. అయితే 2018 ఎన్నికల్లో హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సుహాసిని పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ రాష్ట్రము ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి నుంచి పోటీ చెయ్యడంతో ఇక్కడ ప్రచారానికి నారా చంద్రబాబు నాయుడు వచ్చాడు. నారావారి ప్రచారం కేసీఆర్ కు కలిసొచ్చింది. బాబు ప్రచారాన్ని సెంటిమెంట్ గా టి ఆర్ ఎస్ వాడుకుంది. దీంతో వస్తాయన్న స్థానాలకంటే నాలుగు సీట్లు కేసీఆర్ కు ఎక్కువ వచ్చాయని చెప్పవచ్చు. 2018 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ లో నామరూపాలు లేకుండా పోయింది.

కర్ణాటక సెంటిమెంట్ !
తెలంగాణలో ఇప్పుడు (2023 డిసెంబర్ 30 న ఎన్నికలు) జరుగుతున్న ఎన్నికల్లో టి ఆర్ ఎస్ కు బదులు బి ఆర్ ఎస్ గా మారిపోయిన పార్టీ తొలిసారిగా బరిలో దిగింది. రెండు సార్లు టి ఆర్ ఎస్ మీద గెలిచి అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ ఇప్పుడు బి ఆర్ ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వేడుకుంటున్నాడు. టి ఆర్ ఎస్ నుంచి బి ఆర్ ఎస్ గా మరీన నేపధ్యంలో కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ దూరమైంది. ఇప్పుడు ఆంధ్రోల్లను తిట్టలేడు… ఆంధ్రోళ్ళను పొగడానూ లేడు.దీంతో కేసీఆర్ చేతిలో తెలంగాణ సెంటిమెంట్ లేకుండా పోయింది. ఎలాగైనా ఈ సారి కూడా గెలవాలనే ఆశయంతో ముందుకు పోతున్న బి ఆర్ ఎస్ కర్ణాటక సెంటిమెంట్ ను తెలంగాణ లో రగిల్చే ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించడంలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ఏమి చెయ్యలేదు. హామీలు అమలు చెయ్యడం లేదు వంటి చవకబారు సెంటిమెంట్ ను తెలంగాణ రాజకీయ తెరమీదకు తెచ్చారు. అంతేకాదు కర్ణాటక లో బి ఆర్ ఎస్ మద్దత్తు దారుడైన కుమార స్వామితో కాంగ్రెస్ పై బురదజల్లే ప్రయత్నం చెయ్యడం కూడా ఈ సెంటిమెంట్ లో భాగమేనని అర్థమవుతోంది. మాములుగా కుమార స్వామి కాంగ్రెస్ ను తిట్టడం కొత్తేమి కాకపోయినా తెలంగాణలో కేసీఆర్ పథకాలు బాగున్నాయి అని ఎన్నికల వేల మాట్లాడటం , కుమార్ స్వామి మాటల వెనుక గులాబీ హస్తం ఉందని రాజకీయంగా ఆలోచించే ప్రతి బుర్రకు అర్థమవుతోంది.

ఇంతటితో బి ఆర్ ఎస్ అధిష్టానం ఆగలేదు. తెలంగాణ ఉద్యమంలో టి ఆర్ ఎస్ నేతలు చెయ్యి చేసుకున్న జయప్రకాశ్ నారాయణ చేత ఇంటర్వూ చేయించడం , అది ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం చెయ్యడం, జయప్రకాశ్ నారాయణ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలపై విమర్శలు చెయ్యడం వంటి అంశాలు చూస్తుంటే తెలంగాణ ఉదయాన్ని నడిపిన నాయకుడే ఈ రోజు ఆంధ్రోళ్ల చేత పొగిడించుకునే పరిస్థితి వచ్చిందంటే బి ఆర్ ఎస్ నేతల్లో ఎంతటి అభద్రతా భావం ఏర్పడిందో స్పష్టమవుతోంది. అలాగే సినిమా నటుడు ఆర్. నారాయణా మూర్తి టి న్యూస్ లో ఇంటర్వూ ఇవ్వడం, కేసీఆర్ పాలనను తెగ పొగడటం అంతా చూస్తుంటే పూర్తిగా తెలంగాణ సెంటిమెంట్ ను దూరంగా వదిలేసిందనే భావన ప్రజలలో కలుగుతోంది. ప్రొఫసర్ నాగేశ్వర్ రావు తో కేటీఆర్ ఇంటర్వూ కూడా బి ఆర్ ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగమేనని లోకం కోడై కూస్తోంది. ఎన్నికల ముందే మేడిగడ్డ పిల్లర్ క్రుంగి పోవడం కూడా బి ఆర్ ఎస్ కు వ్యతిరేకపవనలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్న కేసీఆర్ స్పీచ్ లో ఇంతకు ముందు ఎన్నికల స్పీచ్ లో ఉన్న దమ్ము ఇప్పుడు కనిపించడం లేదని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ప్రతి సభలోనూ రొటీన్ డైలాగులే మాట్లాడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కనీసం ఒక నియోజకవర్గం కు వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్య గురించి ప్రస్తావించడం వంటివి కూడా చెయ్యకుండా, కేవలం రొటీన్ డైలాగులు చెప్పి వెళ్లిపోవడం బి ఆర్ ఎస్ పై ప్రజల్లో ఆసక్తిని పెంచలేకపోతున్నాయనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులు కేసీఆర్ కు వ్యతిరేకంగానే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో పని చేసే జర్నలిస్టులు మరింత వ్యతిరేకంగా ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలు కేసీఆర్ కు భజన చేసినప్పటికీ ఎక్కువగా జర్నలిస్టులు మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు.
అయితే మరో పదిహేను రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఏమైనా కొత్త సెంటిమెంట్ ను తెరమీదకు తెచ్చి ఓట్లు దండుకుంటాడో లేక ఇదే రొటీన్ స్పీచ్ తో జనం లోకి పోతారో చూద్దాం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest