అమరావతి
నన్ను అకారణంగా జైల్లో పెట్టారు – నా బాధ, ఆవేదనంతా అదే – నా గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసు” అని జడ్జికి మొరపెట్టుకున్నారు చంద్రబాబు. ఈ రోజు వీడియో కాన్ఫిరెన్స్ లో బాబును జడ్జి ముందు సిఐడి ప్రవేశపెట్టింది. ఆ సమయంలో చంద్రబాబు తన బాధని వెళ్లగక్కారు. దాదాపూ కన్నీటి పర్యంతమైన బాబు ఆవేదనతో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానన్న జడ్జి, చట్టం అందరికీ సమానమని అన్నారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి. అంతేకానీ రిమాండ్ ను శిక్షగా భావించొద్దు, ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం అని జడ్జి బాబుకి చెప్పారు. అయితే ఇప్పటికే జ్యూడిషియల్ రిమాండ్ లొ ఉబ్న్న చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 24 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది.
వీడియో కాన్ఫిరెన్స్ లో బాబును జడ్జి ముందు ప్రవేశపెట్టిన అనంతరం విచారణలో న్యాయమూర్తితో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, “45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది, నాకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు, నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది, నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది,అన్యాయంగా నన్ను అరెస్టు చేశారు, ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన, ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు, నా పై ఉన్నవి ఆరోపణలు మాత్రమే.. నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే.. ఆ చట్టాన్ని గౌరవిస్తా, న్యాయం గెలవాలి.. చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. చంద్రబాబు ఆవేదనకు ప్రతిస్పందించిన జడ్జి కూడా చట్టం అందరికీ సమానమే అన్నారు.
చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. దీనికంటే ముందు ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టు తీర్పు ఇస్తుందని ఆయన తరఫు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టుకు తెలిపారు. దీంతో రెండు తీర్పులపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.