నవ్య భర్త ప్రవీణ్ ఆహ్వానం మేరకు….

 

స్టేషన్‌ ఘన్‌పూర్‌:

ఇటీవల జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ధర్మాసాగర్‌ మండలం జానకీపురం గ్రామ సర్పంచి పూసపల్లి నవ్య ఇంటికి ఆదివారం మధ్యాహ్నం రాజయ్య వచ్చారు. దీంతో సర్పంచి ఇంటి వద్దకు పోలీసులు భారాస కార్యకర్తలు చేరుకున్నారు. అధిష్ఠానం సూచన మేరకు, నవ్య భర్త ప్రవీణ్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్లు రాజయ్య తెలిపారు. అధిష్ఠానం తనకు పలు సూచనలు చేసిందని, అందరూ కలిసి పనిచేయాలని చెప్పిందని తెలిపారు. ప్రవీణ్‌, నవ్య దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాత వారితో కలిసి రాజయ్య మీడియాతో మాట్లాడారు.

నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నా : ‘‘నేను ఏ ఊరిపట్ల వివక్ష చూపలేదు. మహిళలు వారి హక్కులు సాధించుకోవాలి. నా ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తా. నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నా. మహిళల హక్కుల కోసం పోరాటంలో నేనూ ఉంటా. జానకీపురం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా. గ్రామానికి రూ.25లక్షలు మంజూరు చేస్తా’’ అని రాజయ్య తెలిపారు.

మహిళలను వేధిస్తే కిరోసిన్‌ పోసి నిప్పంటించేందుకైనా సిద్ధం : సర్పంచ్‌ నవ్య
‘‘ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యం. ఎమ్మెల్యే రాజయ్య వల్లే నేను సర్పంచ్‌ను కాగలిగాను. రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదు. పార్టీలో ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా గౌరవం ముఖ్యం. మాకు దక్కాల్సిన గౌరవం దక్కకుంటే సహించేది లేదు. మహిళలపై అరాచకాలు జరిగితే సహించేది లేదు. మహిళలను వేధిస్తే కిరోసిన్‌ పోసి నిప్పంటించేందుకైనా సిద్ధం. పార్టీలో తప్పులు జరిగితే ఖండిస్తూనే ఉంటా’’ అని సర్పంచి నవ్య తెలిపారు.

ఏం జరిగిందంటే :

స్టేషన్‌ఘన్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.రాజయ్య రెండేళ్లకుపైగా తనను వేధిస్తున్నారని హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం జానకిపురం సర్పంచి కురుసపల్లి నవ్య శుక్రవారం తన భర్త ప్రవీణ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ‘నన్ను ఎమ్మెల్యే వేధిస్తున్నారు. పిల్లల పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని కలిసినప్పుడు మాకు తండ్రిలాంటి వారని, ఇలా చేయడం తగదని చెప్పా. అయినా ఎమ్మెల్యే ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉన్నాం. మా గ్రామానికి మొదటి నుంచీ నిధులు ఇవ్వడంలేదు. చాలామంది మహిళలు సార్‌ వద్దకు వచ్చిపోతున్నారని, మీరూ వస్తే మీ గ్రామానికి నిధులు, మీ అవసరాలు తీరుస్తారంటూ భారాస మహిళ ఒకరు నన్ను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి దాన్ని కాదని ఆమెకు నేను స్పష్టంగా చెప్పా. ఆమె పేరును సమయం వచ్చినప్పుడు చెబుతా. అందరి జాతకాలు నా వద్ద ఉన్నాయి. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోయా. నా మీద కోరికతో, నేనంటే ఇష్టంతో పార్టీ టికెట్‌ ఇచ్చానంటాడా..? బిడ్డ లాంటిదానితో ఐ లవ్యూ అంటాడా..? తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకోవాలి. ఎవరో వెనక ఉండి కావాలని, చేయిస్తున్నారంటారా? నేను ఆడపిల్లనా..? ఆట బొమ్మనా..? అందరి ముందుకొచ్చి నాకు ఇలా జరిగిందని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. నేను బయటికొస్తే, ఎమ్మెల్యే వేధింపులకు గురైన మిగతా మహిళలూ బయటకొస్తారు. రాజయ్య వేధింపులపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్తా. వారు నా ఆవేదనను అర్థం చేసుకుని, న్యాయం చేస్తారని నమ్మకముంది’ అని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest