నాలుగు కీలక నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థుల ఖరారు?

అమరావతి :

ఎన్నికల వేళ టీడీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వివాదాలు నెలకొన్న నియోజకవర్గాల్లో ముందుగా ఇంఛార్జ్ లను నియమించింది. పొత్తులు తేలిన తరువాత వారిని అధికారికంగా అభ్యర్ధులుగా ప్రకటించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఇప్పటి వరకు ఇంఛార్జ్ ల వ్యవహారంలో సందిగ్ధత కొనసాగుతున్న నాలుగు నియోజకవర్గాల్లో కొత్తగా బాధ్యతలు ఖరారు చేసింది. ఆ నాలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్ధులుగా వారే ఉండే ఛాన్స్ ఉంది. ఇక..రాజకీయంగా ఆసక్తిని పెంచిన తుని సీటు విషయంలోనూ టీడీపీ తమ నిర్ణయం ప్రకటించింది. అక్కడ యనమల సోదరుడు సీటు డిమాండ్ చేస్తున్న వేళ..పార్టీ నాయకత్వ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.
తుని టీడీపీ ఇంఛార్జ్ గా యనమల దివ్య
నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ కొత్త ఇంఛార్జ్ లను నియమించింది. తుని నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ గా సీనియర్ నేత యనమల కుమార్తె దివ్య పేరు ఖరారు చేసారు. కొద్ది రోజులుగా ఇక్కడ ఇంఛార్జ్ పదవి పైన యనమల సోదరుడు కృష్ణుడు పట్టు బడుతున్నారు. నియోజకవర్గంలో తనకు అనుకూలంగా ఉన్నవారితో మాట్లాడిన ఆడియో వైరల్ అయింది. కానీ, ఇప్పుడు అధినాయకత్వం ఆయన్ను కాదని దివ్య కు ఇంఛార్జ్ గా ఖరారు చేసింది. దీని పైన కృష్ణుడు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తుని నుంచి ప్రస్తుతం మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో దివ్య పోటీ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. యనమల రామకృష్ణుడు ఇక్కడి నుంచి ఆరు సార్లు గెలుపొందగా, ఆయన సోదరుడు కృష్ణుడు వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. దీంతో.. ఇప్పుడు కృష్ణుడు ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో యనమల కుమార్తుకు అసెంబ్లీ సీటు దక్కితే..యనమల రామకృష్ణుడు పార్టీ అధికారంలోకి వస్తే మండలి లేదా రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నెల్లిమర్ల..సత్యవేడులో కొత్త నేతల ఎంట్రీ
2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో విజయనగరం ఉంది. జిల్లాలో నెల్లమర్ల నుంచి పార్టీ సీనియర్ గా..ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పతివాడ నారాయణ స్వామి స్థానంలో కొత్తగా కర్రోతు బంగార్రాజు ఇంఛార్జ్ గా నియమితులయ్యారు. పతివాడ నారాయణస్వామినాయుడును వయో భారం కారణంగా తప్పిస్తారని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో నారాయణస్వామినాయుడే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. కానీ ఓటమి చవిచూశారు. తనను తప్పిస్తే కుమారుడికి బాధ్యతలు అప్పగించాలని పతివాడ కోరుతూ వచ్చారు. డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌, నెల్లిమర్ల మాజీ ఎంపీపీ సువ్వాడ రవిశేఖర్‌ వనజాక్షి, కడగల ఆనంద్‌ కుమార్‌లు సైతం నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను ఆశించారు. కానీ హైకమాండ్‌ మాత్రం భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు వైపే మొగ్గుచూపింది. ఆయనే పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్‌ నియమితులయ్యారు. హేమలత 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజశేఖర్ పోటీ చేసారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా హెలెన్ బరిలో నిలవనున్నారు.
బాలయోగి కుమారుడికి కీలక బాధ్యతలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ గా దివంగత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి తనయుడు హరీష్‌ మాధుర్‌ నియమితులయ్యారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీచేసి నారాయణమూర్తి గెలుపు సాధించారు. సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణమూర్తికి 2019 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ విషయంలో మరోసారి మొండిచేయి చూపింది. అతనిని కాదని పెద్దగా సంబంధాలు లేని నేలపూడి స్టాలిన్‌ బాబును అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచింది. వైసీపీ నుంచి పోటీ చేసిన కొండేటి చిట్టిబాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం హరీష్‌ మాధుర్‌ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నుంచి ఇన్‌చార్జి అడుగుతున్నవారిలో మోకా ఆనందసాగర్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ముమ్మిడివరానికి చెందిన ఆనంద్‌సాగర్‌ను స్థానిక క్యాడర్‌ వ్యతిరేకిస్తుంది. దీంతో..బాలయోగి తనయుడు హరీష్ కు ఇంఛార్జ్ గా బాధ్యతలు ఖరారు చేసారు. ఆయనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా తెలుస్తోంది. జనసేనతో పొత్తు అధికారం అయితే, చివరి నిమషంలో మార్పులు జరిగితే మినహా టీడీపీ అభ్యర్ధులుగా బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest