నిమ్స్ ఆసుప‌త్రి జాతీయ రికార్డు-ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిడి స‌ర్జ‌రీలు

 

  • దేశంలోనే ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో సరికొత్త చరిత్ర
  • ఆరోగ్య శ్రీ కింద పూర్తి ఉచితంగా శస్త్ర చికిత్సలు
  • నిమ్స్ వైద్య బృందానికి మంత్రి హరీశ్‌రావు అభినందన
  •  నిమ్స్‌లో 2014 నుంచి ఇప్పటివరకు 839 కిడ్నీ మార్పిడులు జరిగాయి.
  • ఇందులో 509 లైవ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కాగా, 330 కెడ‌వ‌ర్ నుంచి సేకరించినవి.
  • 25 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహించారు.
  • ఇందులో 11 లైవ్‌, 14 కెడవర్‌ ఉన్నాయి.
  • 10 గుండె మార్పిడి సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు.
  • ఒకరికి ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ జరిగింది.హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుప‌త్రి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్వ ఆసుప‌త్రిగా జాతీయ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు నిమ్స్‌ యూరాలజీ విభాగాన్ని అభినందించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేర‌కు అవయవ మార్పిడి సర్జరీలను ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

నిమ్స్‌ యూరాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ నేతృత్వంలో డాక్టర్‌ సీహెచ్‌ రామ్‌ రెడ్డి, డాక్టర్‌ ఎస్‌ విద్యాసాగర్‌, డాక్టర్‌ జీ రామచంద్రయ్య, డాక్టర్‌ జీవీ చరణ్‌ కుమార్‌, డాక్టర్‌ ఎస్‌ఎస్‌ఎస్‌ ధీరజ్‌తో కూడిన బృందం ఈ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్‌ పద్మజ, డాక్టర్ జే నిర్మల నేతృత్వంలోని అనస్థీషియా విభాగం, డాక్టర్‌ టీ గంగాధర్‌, డాక్టర్ భూషణ్ రాజ్ నేతృత్వంలోని నెఫ్రాలజీ విభాగం వారికి స‌హ‌క‌రించారు.

మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ఫ్లాంట్‌ సెంటర్‌గా నిమ్స్‌
తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నిమ్స్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. భారీగా నిధులు కేటాయించారు. దీంతో ఆసుప‌త్రిలో అత్యాధునిక వసతులు సమకూరాయి. నిమ్స్ ఆసుప‌త్రి మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌గా మారింది. ఇక్కడ కిడ్నీతోపాటు కాలేయం(లివర్‌), గుండె (హార్ట్‌), ఊపిరితిత్తులు (లంగ్‌) మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. అవయవ మార్పిడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు కేటాయిస్తూ, పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నది. అంతేకాకుండా రోగుల‌కు జీవితాంతం అవసరమయ్యే మందులను ఉచితంగా అంజేస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో విజవంతంగా సర్జరీలు చేస్తున్నట్లు డాక్టర్ రాహుల్ దేవరాజ్, యురాలజి విభాగం హెచ్ వో డి తెలిపారు.

వైద్యబృందానికి అభినందనలు – ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు
నిమ్స్‌ డైరెక్టర్ బీరప్ప అధ్వర్యంలో, నిమ్స్ యూరాలజీ విభాగం ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిడి సర్జరీలు విజయవంతంగా నిర్వహించి జాతీయ రికార్డు సృష్టించాడం, పేషంట్లందరూ ఆరోగ్యంగా ఉండటం మంచి విషయం. సీఎం కేసీఆర్‌  నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవయవ మార్పిడి శస్త్రచికిత్సలన్నీ ఆరోగ్య శ్రీ పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఈ సర్జరీల్లో భాగస్వాములైన వైద్యబృందం, జీవన్ దాన్ కోఆర్డినేటర్ స్వర్ణలతకు ప్రత్యేక అభినందనలు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest