పీసీసీ అధ్యక్షుడు ఎలా ఉండాలి?రేవంత్ తో అసలు నేతలేరీ?

హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టాడు. ఎమ్మెల్యే సీతక్క ప్రాంతమైన ములుగు నుంచి రేవంత్ హాథ్ సి హాథ్ జోడో యాత్రను మొదలు పెడితే ఎందుకు అసలు కాంగ్రెస్ నేతలు,లేదా సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆయన వెంట నడవడంలేదు అనేది ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న. తెలంగాణకు ఇంచార్జ్ మారినప్పటికీ కాంగ్రెస్ సీనియర్లలో మార్పు రాలేదా? లేక రేవంత్ రెడ్డి అందరికి కలుపుకుపోవడం లేదా? అని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఒక పక్క సీతక్క బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా రేవంత్ తో కలిసి పాదయాత్రలో ఉంది. ఉన్న మరో నలుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు. మరి మిగిత సీనియర్ నాయకులంతా ఏరి? సీనియర్లకు, రేవంత్ కు మధ్య సఖ్యత కుదరడం లేదా? ఒక్క మల్లు రవి తప్ప కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఎవరూ లేరా? ములుగు జిల్లా నుంచి మహబూబ్ బాద్ జిల్లాలోకి అడుగు పెట్టిన ఒక్క సీనియర్ కాంగ్రెస్ నేత కనిపించకపోవడంతో కార్యకర్తల్లో అనేక రకాల అనుమానాలు మెదులుతున్నాయి. తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరూ రేవంత్ రెడ్డితో కలిసి రాకపోతే తా పరిస్థితి ఏంటి ? అని చాలా మంది సెకండ్ గ్రేడ్ లీడర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ సీనియర్లను పట్టించుకోవడం లేదా ?
అసలైన కాంగ్రెస్ సీనియర్ల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఇంకా మారలేదని వాదన వినిపిస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీనియర్లు దూరంగా ఉంటున్నరని టాక్. రేవంత్ రెడ్డి కనీసం విలువ కూడా ఇవ్వకపోవడంతోనే మర్రి శశిధర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ ను విడిచిపెట్టి వెళ్లిపోయారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల సీనియర్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి రేవంత్ తో మాట్లాడేందుకు ప్రయత్నించగా, మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడండి.. తరువాత ఆయన నాకు చెప్తాడు అని రేవంత్ వ్యాఖ్యానించారట. దీంతో కోదండ రెడ్డి మనసు నొచ్చుకున్నట్టు గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు అని ప్రచారం జరుగుతోంది. ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈలోపు సీనియర్లను దూరంగా పెట్టేసి కొత్త రక్తంతో ఆ తరువాత జరిగే ఎన్నికల్లో తన సత్త చాటాలని రేవంత్ భావిస్తున్నట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
పీసీసీ అధ్యక్షుడు ఎలా ఉండాలి?
పీసీసీ అధ్యక్షుడు ఎలా ఉండాలి ? అనే దానికి కాంగ్రెస్ నుంచి బి ఆర్ ఎస్ కు వెళ్లిన ఓ సీనియర్ ఎమ్మెల్యే ఇలా ఉదహరించారు. చెన్నారెడ్డికి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినప్పుడు అప్పటి ఆంధ్రప్రాంతం నాయకుడిని తొలగించి చెన్నారెడ్డికి ఇచ్చారట. మధ్యలో చెన్నారెడ్డికి పదవి వచ్చింది కాబట్టి అప్పటివరకు పని చేసిన నాయకులు తనకు సహకరిస్తారా లేదో అని అసమ్మతి నాయకులందరి దగ్గరికి స్వయంగా చెన్నారెడ్డి వెళ్లి కలిశారట. అప్పుడు చాలా గ్రూపులు ఉన్నాయట కాంగ్రెస్ లో. అందులో బలమైన గ్రూపులు మరి. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, ఇలా చాలా గ్రూపులు ఉన్నప్పటికి అందరిని కలుపుకుని వెళ్లేవారట. ఒక నాయకుడు ఏడెనిమిది సీట్లు అదిరితే పది సీట్లు ఇచ్చాడట. దీంతో అందరూ నాయకులూ తమ తమ గ్రూపులను సైతం పక్కన పెట్టి చెన్నారెడ్డితో కలిసి పని చేశారట. పీసీసి ప్రెసిడెంట్ అనేవాడు ఇలా ఉండాలి కానీ సీనియర్లను , అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనపెట్టి తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళతో వెళ్తానంటే ఎలా? అని సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest