బాబు ఆఫర్ల గురించి లేటుగా చెబుతున్న ఎమ్మెల్యేలు – రాజకీయ వ్యూహమా ?

 

  • విధేయతను నిరూపించుకోవడమా ?
  • టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణలు…క్రాస్ ఓటింగ్ ఆఫర్లు ఇచ్చారని ఆరోపణలు
  • రోజుకొకరు ఎందుకు తెర ముందుకు వస్తున్నారు?
  • ఓటింగ్ కు ముందే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ?
  • ఈ ఆరోపణల రాజకీయం ఎందుకు ?

అమరావతి :
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసి వారం అవుతోంది. అయితే వైఎస్ఆర్‌సీపీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు .. ఒక్కో రోజు బయటకు వచ్చి తమకు టీడీపీ ఆఫర్ ఇచ్చిందని ఆరోపణలు చేయడం ప్రారంభించారు. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ఆఫర్ వదిలేశామని.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా జగన్ వెంటే ఉంటామని చెప్పుకొస్తున్నారు. అసలు వీరందరికీ ఆఫర్లు వస్తే ముందే చెప్పకుండా ఎన్నికలైపోయిన వారానికి ఒక్కొక్కరుగా ఎందుకు బయటకు వస్తున్నారన్నది అంతు చిక్కని విషయంగా మారింది. ఇలా ఆఫర్లు వచ్చాయని చెప్పిన వారిలో ఇద్దరు ఇతర పార్టీల్లో గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. వారు కూడా తమకు నైతిక విలువలు ఉన్నాయని చెబుతున్నారు. మొదట జనసేన తరపున గెలిచి వైసీపీకి ఓటేసిన రాపాక వచ్చారు… తర్వాత టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి ఓటేసిన మద్దాలి గిరి వచ్చారు. ఇప్పుడు వైసీపీ నుంచే గెలిచిన ఎమ్మెల్యే ఆర్థర్ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వీరు అసలు ఎందుకు ఇలా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారన్నది సస్పెన్స్ గా మారింది.

అధికార పార్టీగా ఉండి ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెడుతూంటే కనిపెట్టలేకపోయారా ?

అధికార పార్టీకి ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది. అధికార పార్టీ చేతిలో ఇంటలిజెన్స్ ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేస్తుంది. చంద్రబాబు ఎమ్మెల్సీగా అనూరాధను పోటీ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే ఏదో వ్యూహం ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ఊహించి ఉంటారు. అందుకే ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించకుండా పూర్తిస్తాయిలో ఇంటలిజెన్స్ ను ఉపయోగించాని చెబుతున్నారు. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలందరిపై పూర్తిస్థాయి నిఘా పెట్టడమే కాదు.. సీఎం జగన్ స్వయంగా పిలిచి మాట్లాడారని చెబుతున్నారు. అప్పటికే ముందు రోజే క్యాంపులు ఏర్పాటు చేసి అందర్నీ బ్యాచ్‌ల వారీగా తీసుకెళ్లి ఓట్లు వేయించారు. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్రాస్ ఓటింగ్ చేశారంటూ నలుగుర్ని సస్పెండ్ చేశారు. అందులో ఇద్దరి ఓట్లను వైఎస్ఆర్‌సీపీ ముందుగానే పరిగణనలోకి తీసుకోలేకపోయింది. మరో ఇద్దరు ఉదయగిరి, తాడికొండ ఎమ్మెల్యేలని చెప్పి సస్పెండ్ చేశారు. అయితే ఇంత అడ్వాంటేజ్ ఉన్నా .. వారి క్రాస్ ఓటింగ్ చేస్తారని ఊహించలేకపోయారు. వారికి ఎలాంటి అనుమానం రాలేదు. ఇప్పుడు తమకు ఆఫర్లు వచ్చాయని చెబుతున్నవారు కూడా అప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయలేదు.

విచారణ చేయించే వ్యూహంతో వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఆరోపణలు చేయిస్తోందా ?

అయితే టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు డబ్బులు అందాయని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఆరోపణలు నేరుగానే చేశారు. అయితే ఓటింగ్ కంటే ముందే వైఎస్ఆర్‌సీపీకి కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి దూరమయ్యారు. వారి ఓట్లను లెక్కలోకి తీసుకోలేదు. ఫలానా వారికి ఓటు వేయాలని కూడా వైఎస్ఆర్‌సీపీ చెప్పలేదు. ఇక మేకపాటి ధనవంతుడైన రాజకీయ నేత. పైగా సీఎం జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుండి ఆయన వెంటే ఉన్నారు. ఆయన డబ్బులు తీసుకుని ఓటు వేస్తారని ఎవరూ అనుకోలేరు. ఉండవల్లి శ్రీదేవి జగన్ పట్ల ఎంత విధేయంగా ఉంటారో అసెంబ్లీలోనే నిరూపించుకున్నారు. ఆమె కూడా డబ్బులకు ఓటేస్తారని అనుకోరు. కానీ సజ్జల రామృష్ణారెడ్డి అవే ఆరోపణలు తీవ్రంగా చేస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేలతో ఆఫర్లు వచ్చినట్లుగా ఆరోపణలు చేయించడం ద్వారా విచారణకు ఆదేశాలిచ్చేలా చూసుకోవాలన్న వ్యూహం వైసీపీ అమలు చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఎమ్మెల్యేలు తమ విధేయతను ప్రదర్శించాలనుకుంటున్నారా ?

మరో వైపు టీడీపీ తమకు ఎవరి ఓట్లు పడలేదని.. తమ ఎమ్మెల్యేల ఓట్లు మాత్రమే పడ్డాయని చెబుతోంది. కానీ తమతో నలభై మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని అంటోంది . అదే సమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారన్న అనుమానం ఆ పార్టీలో ఉంది. ఇలా అనుమానం ఉన్న వాళ్లే తమ విధేయతను నిరూపించుకోవడానికి తమకు ఆఫర్ వచ్చింది కానీ జగన్ పై నమ్మకంతోనే తిరస్కరించామని ప్రకటించుకుంటున్నారని భావిస్తున్నారు. టీడీపీ పిలిచినా వెళ్లలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా టిక్కెట్ ఇస్తారన్నది వారు ఆలోచన కావొచ్చని అంటున్నారు. అందుకే అంతా అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు తెరపైకి వస్తున్నారని అంటున్నారు. మొత్తంగా ఈ ఆరోపణల రాజకియం మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest