భారత్‌తో బలమైన మైత్రి అవసరం

  • అప్పుడే చైనా నుంచి అమెరికాకు ఆర్థిక స్వాతంత్య్రం
  • మోడీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా
  • ‘పీటీఐ’తో ముఖాముఖిలో వివేక్‌ రామస్వామి

అయోవా :

భారత్‌తో బలమైన బంధం అమెరికాకు అత్యావశ్యకమని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిత్వం ఆశిస్తున్న ప్రముఖ భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి అన్నారు. చైనా నుంచి అమెరికా ‘స్వాతంత్య్రం’ పొందేందుకు అది దోహదపడుతుందని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే ప్రయత్నాల్లో తీరిక లేకుండా ఉన్న ఆయన- తాజాగా ‘పీటీఐ’ వార్తాసంస్థతో ముఖాముఖిలో పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థికంగా చైనాపై ఆధారపడి ఉంది. భారత్‌తో బలమైన సంబంధాలను కలిగి ఉంటే దాన్నుంచి బయటపడొచ్చని వ్యాఖ్యానించారు. ఢిల్లీతో పటిష్ఠ వ్యూహాత్మక సంబంధమూ వాషింగ్టన్‌కు అవసరమని పేర్కొన్నారు. అండమాన్‌ సముద్రంలో దానితో సైనిక సంబంధాలు చాలా కీలకమని చెప్పారు. అవసరమైతే మలక్కా జలసంధిని భారత్‌ తన నియంత్రణలోకి తీసుకోగలదని అన్నారు. పశ్చిమాసియా నుంచి చైనా ఎక్కువ శాతం చమురును ఆ జలసంధి ద్వారానే పొందుతున్న సంగతిని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్‌కు బాగా నాయకత్వం వహిస్తున్నారని రామస్వామి అన్నారు. భారత్‌-అమెరికా సంబంధాలను బలోపేతం చేసేలా ఆయనతో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

దేశ ప్రయోజనాలకు ముఖ్యం కాని వ్యవహారాల్లో ప్రస్తుతం అమెరికా ఎక్కువగా జోక్యం చేసుకుంటోందని వివేక్‌ రామస్వామి అభిప్రాయపడ్డారు. తమ విదేశాంగ విధానంలోని ప్రధాన సమస్యగా దాన్ని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సంబంధిత వ్యవహారాల్లో అమెరికా కొనసాగడం తప్పిదమని వ్యాఖ్యానించారు. అది స్వదేశీ ప్రయోజనాలకు ఎంతమాత్రమూ ఉపయోగకరం కాదని, వాస్తవానికి అంతర్జాతీయ వేదికలపై అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తుందని అన్నారు. స్వదేశీ సరిహద్దుల్లో రక్షణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, చైనాపై దృష్టిసారించడం ప్రస్తుతం తమ దేశానికి అత్యవసరమని తెలిపారు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ పల్స్‌ స్ట్రైక్స్‌, సైబర్‌ దాడులు, అణ్వస్త్ర క్షిపణి సామర్థ్యాల వంటి కీలక అంశాల్లో బీజింగ్‌పై ఏమాత్రం ఆధారపడకుండా ఉండాలన్నారు. అమెరికా, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ నిరుడు మునుపెన్నడూ లేనంత స్థాయిలో 690.6 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అందులో అమెరికా దిగుమతుల వాటా ఏకంగా 536.8 బిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest