మమ్మల్ని చంపేస్తున్నారు-HRCకి బహుజన ఐకాస లేఖ

అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దమనకాండ జరుగుతుందని, మమ్మల్ని చంపేస్తున్నారు అంటూ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య కేంద్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి లేఖ రాశారు. మంగళవారం ఈ మేరకు ఈమెయిల్ ద్వారా ఆయన లేఖను పంపారు. లేఖ వివరాలను, సారాంశాన్ని మీడియాకు వెల్లడించారు. 45 నెలల వైకాపా పాలనలో తొలి బాధితులు దళితులే అన్నారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను, మాస్క్ పెట్టుకోనందుకు చీరాల కిరణ్ కుమార్ ను చంపేశారు అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు పక్కా ప్లాన్ తో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారని, బెయిల్ పై విడుదలై తే, గజమాలలతో సత్కరించారని చెప్పారు. కృష్ణాయపాలెంలో ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి దళిత రైతులను 24 రోజులు జైల్లో పెట్టారన్నారు. బేడీలు వేసి బస్సులో తిప్పారని ఆరోపించారు. కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పని చేస్తున్న డాక్టర్ అచ్చెన్న ను హత్య చేశారు. కుమారుడు చక్రవర్తి అనుమానితుల పేర్లు ముందుగా ఇచ్చినా పోలీసులు విచారించలేదన్నారు. తాటికొండ దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన నియోజకవర్గానికి వెళ్లేందుకు భయంగా ఉందని, తనను హత్య చేసే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై ఆరోపణ చేయటం దళితులపై జరుగుతున్న దారుణాలకు పరాకాష్ట అని అభిప్రాయ పడ్డారు. కాకినాడలో గిరీష్ బాబు అనే దళిత యువకుడు కాళ్లలో రాడ్లు ఉన్నాయని చెప్పినా, ఎస్సై కనికరించలేదన్నారు. రాడ్లు చూపమని లాఠీకి రబ్బరు తగిలించి కొట్టినట్లు ఆరోపించారు. ఇసుక ట్రాక్టర్ ను అడ్డుకున్నాడని ఇందుగుమిల్లి వరప్రసాద్ కు శిరోముండనం చేశారని, రాష్ట్రపతి కి లేఖ రాసినా ఫలితం లేదని తెలిపారు.పులివెందుల నాగమ్మ, నంద్యాల మహాలక్ష్మిలపై అత్యాచారాలు జరిగాయని, పేరేచర్లలో మహిళపై జరిగిన అత్యాచారం కేసులో 80 మందిని అనుమానితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. తప్పులను ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారు. అన్యాయం పై తిరగబడితే హత్య చేస్తున్నారు. అణచి వేతలపై గొంతు ఎత్తితే దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులపై దాడులు జరగని జిల్లా కానీ, నియోజకవర్గం కానీ, గ్రామం కానీ ఏపీలో లేదు అన్నారు. పోలీసుల వేధింపులకు తాళలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెప్పారు. దొంగ కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపించారు. తెలుగు నేల చరిత్రలో గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో దమణకాండ జరుగుతుందని ధ్వజమెత్తారు. గతంలో ఢిల్లీలో హెచ్ఆర్సీని స్వయంగా కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చామన్నారు. హెచ్చార్సీ ఏపీ సిఎస్ కు లేఖ పంపి నెలలు గడిచినా ఇప్పటివరకు తనకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ మొత్తం సంఘటనపై కేంద్రంలోని హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో పూర్తి విచారణ జరిపించాలని బాలకోటయ్య లేఖలో డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest