మాజీ మంత్రి కాకులమర్రి ఇక లేరు

హైదరాబాద్ , మార్చి 13 :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రి గా పని చేసిన కాకులమర్రి విజయరామారావు కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న కెవిఆర్ జూబిలీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కెవిఆర్ సొంత ఊరు ఏటూరు నగరం . మద్రాసు యూనివర్సిటీ లో ఉన్నత చదువులు చదివిన కెవిఆర్ ఐ పీ ఎస్ గా సెలెక్ట్ అయ్యారు. 1984 లో ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పని చేశారు. సీబీఐ డైరెక్టర్ గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. హవాలా కుంభకోణం, బాబ్రీ మజీద్ కూల్చివేత , ఇస్రో కేసు, ముంబై వరుస పిల్లుల కేసులను ఆయన విచారించారు.

(గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కెవిఆర్)

పీజీఆర్ ను ఓడించిన కెవిఆర్
సీబీఐ డైరెక్టర్ గా పదవి విరమణ చేసిన కాకులమర్రి విజయరామారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాకులమర్రి విజయరామారావు(KVR ) అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పబ్బతి రెడ్డి జనార్దన్ రెడ్డి (PJR )ని ఓడించారు. ఎవరూ ఊహించని విధంగా పీజీఆర్ ను ఓడించడంతో కెవిఆర్ కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మంత్రి పదవి వరించింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రిగా కెవిఆర్ పని చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాకుల మర్రి విజయరామారావు మళ్ళీ పీజీఆర్ చేతిలో ఓడిపోయారు.

(కాలనీవాసులతో కెవిఆర్)

టి ఆర్ ఎస్ కు పరోక్ష కారణం !
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టి ఆర్ ఎస్ పెట్టడానికి కెవిఆర్ పరోక్ష కారణమైయ్యారని చెప్పవచ్చు. పీజీఆర్ పై విజయం సాధించిన విజయ రామారావు కు మంత్రి పదవి ఇవ్వక తప్పలేదు. దీంతో వెలమ సామజిక వర్గాల నేపథ్యంలో చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను చంద్రబాబు పక్కన పెట్టాల్సి వచ్చింది. మంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో కేసీఆర్ ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చెయ్యడం తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టి ఆర్ ఎస్ పార్టీ పెట్టారు.

(టి ఆర్ ఎస్ లోకి చేరే ముందు కేటీఆర్ తో కెవిఆర్ ,ఆయన కుమార్తె)

కేసీఆర్ చెంతనే కెవిఆర్
తెలంగాణ లో 2014లో టి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత విజయ రామారావు అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికే తరువాత టి ఆర్ ఎస్ లో చేరారు. కానీ ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. టి ఆర్ ఎస్ పార్టీలో కండువా కప్పుకున్నప్పటికీ క్రీయాశీలక రాజకీయాలకు కెవిఆర్ దూరంగానే ఉన్నారు.

(ఎన్ టి ఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న కెవిఆర్)

సిన్సియారిటీ – నిఖార్సైన మనిషి
కాకులమర్రి విజయరామారావు ఎంతటి నిఖార్సైన మనిషి అంటే సొంత పార్టీ నేతలు సైతం తప్పు చేస్తే ఒప్పుకునేవాడు కాదు. తెలుగుదేశం పార్టీ నేతలు అప్పట్లో బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఓ కేసు నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళను బయటికి తీసుకురావడానికి చాలామంది ప్రయత్నించి చివరికి కెవిఆర్ కు చెబితే , తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పారట. నిజాయితీ, నిబద్దత, ఆయన నైజం. ఏ పని చేసిన ఎంతో తెలివిగా, పట్టుదలతో ముందడుగు వేసేవారు.

(కెవిఆర్ పీఏ విజయ్ ను పలకరించిన బాబు)

పెన్నుతో రాసిన పేరు కెవిఆర్
1999 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖైరతాబాద్ టీడీపీ అభ్యర్థి కోసం ఎంతో ఉత్కంఠ కొనసాగింది. విజయరామారావు పేరు కంటే ముందు నారాయణ స్వామి, సుదర్శన్ (దర్శన్), డాక్టర్ ప్రతాప్ రెడ్డి, సుధాకర్ గౌడ్, వీర రాఘవరెడ్డి లాంటి వాళ్ళు టికెట్ అడిగారు. కూకట్ పెళ్లికి చెందిన డాక్టర్ ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇస్తారని ఒకానొక దశలో ప్రచారం బాగా జరిగింది. అయితే అప్పుడే సీబీఐ డైరెక్టర్ గా పదవి విరమణ చేసిన కాకులమర్రి విజయరామారావు చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. అందుకే కాబోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మీడియా సంస్థలకు వచ్చిన ఫేస్ పేపెర్ పైన అందరి పేర్లు టైప్ చేసి పంపితే , చివరి పేజీలో మాత్రం ఖైరతాబాద్ -కె. విజయరామ రావు అని పెన్నుతో స్వయంగా చంద్రబాబు రాసి పంపారు.

కబ్జాదారులకు మేలు
అవినీతి విషయంలో ఎంతో నిజాయితీగా ఉండే కెవిఆర్ బంజారాహిల్స్ కు చెందిన ఇద్దరు స్థానిక విలేకరుల అరాచకాల విషయంలో మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించారనే అపప్రద ఆయన పై ఉంది. ఇద్దరు స్థానిక విలేకరులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసుకుంటే వారికి కెవిఆర్ సహకరించారని ప్రచారం ఉంది. తెలుగుదేశం లో పని చేసే ఇద్దరు వ్యక్తుల ఒత్తిడి వల్ల కబ్జాదారులైన విలేకరులకు విజయరామారావు సపోర్ట్ చేశారని తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మిగితా ఏ విలేఖరికి కూడా ఎలాంటి సహాయం చెయ్యని విజయరామారావు స్థానిక ఇద్దరు విలేకరుల ఆగడాలను చూసి చూడనట్టు వ్యవహరించారని తెలుగుదేశం కార్యకర్తలు గుసగుసలాడుకునేవారు.

(కెవిఆర్ కుమార్తెను పరామర్శించిన ఎమ్మెల్యే దానం నాగేందర్)

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest