మోడీ పై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించాలన్న పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

  • ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పై బీబీసీ డాక్యుమెంటరీ
  • గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో డాక్యుమెంటరీ
  • మోడీని తప్పుగా చిత్రీకరించారంటూ నిరసన జ్వాలలు
  • సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్

న్యూఢిల్లీ :

అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ వివాదాస్పదం కావడం తెలిసిందే. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తయారైన ఈ డాక్యుమెంటరీ బీజేపీ వర్గాలను తీవ్ర ఆగ్రహనికి గురిచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. ఇది పూర్తిగా అపోహలతో కూడుకున్న పిటిషన్ అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇటీవల బీబీసీ డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా, బీరేంద్ర కుమార్ సింగ్ అనే రైతు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. భారత్, కేంద్ర ప్రభుత్వంపై పక్షపాత ధోరణితో ఈ డాక్యుమెంటరీ రూపొందించారని, అంతర్జాతీయంగా భారత్, ప్రధాని నరేంద్ర మోడీ పేరు మార్మోగుతుండడంతో కుట్రపూరితంగా ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారని పిటిషన్ లో పేర్కొన్నారు. భారత్ లో సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు బీబీసీ ఈ రీతిలో హిందూ వ్యతిరేక ప్రచారానికి తెరదీసిందని ఆరోపించారు. ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తులు పూర్తిగా తప్పుగా ఊహించుకుని ఈ పిటిషన్ వేశారని, ఈ పిటిషన్ ఏమాత్రం విచారణార్హమైనది కాదని, అందుకే కొట్టివేస్తున్నామని స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest