రాబోయే ఎన్నికల్లో”ప్రత్యేక హోదా”ప్రధాన ఎజెండా

 

  • విజయవాడకు చేరుకున్న ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విద్యార్థి, యువజన సంఘాల సమరయాత్ర,
  • యాత్రకు ఘన స్వాగతం పలికిన విద్యార్థులు, భారీ సభ
  • ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, రాబోయే ఎన్నికల్లోను ఆంధ్రప్రదేశ్ లో ఇదే ప్రధాన ఎజెండా అవుతుంది
  • రాజధాని లేని రాష్ట్రంగా చేసిన పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే
  • హోదాపై పోరాడుతానన్న జగన్ మడమ తిప్పారు, నమ్మకద్రోహం చేశారు
  • ప్రతిపక్ష నేత చంద్రబాబు కేంద్రం అన్యాయంపై నోరు విప్పాలి
  • పవన్ కళ్యాణ్ బీజేపీ కబంధ హస్తాల నుండి బయటికి రావాలి

విజయవాడ

ప్రధాన పార్టీలు కేంద్రానికి లొంగుబాటు వైఖరి ప్రదర్శిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విద్యార్థులలో చేవ చావలేదు, పోరు సాగిస్తారు, ఇచ్చాపురం వరకు సమర యాత్ర సాగుతుంది.అవసరమైతే ఢిల్లీలోనూ ఆందోళన చేస్తాం. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు జరుగుతున్న విద్యార్థి, యువజన సమరయాత్ర నేడు విజయవాడ చేరింది.బెంజ్ సర్కిల్ వద్ద యాత్రకు విద్యార్థి, యువకులు ఘన స్వాగతం పలికారు. మోటార్ సైకిల్ ర్యాలీగా బసవన్నయ్య విజ్ఞాన కేంద్రానికి యాత్ర చేరింది. మహాత్మా గాంధీ రోడ్డు నుండి ఎంబి విజ్ఞాన కేంద్రం వరకు ప్రదర్శన జరిగింది. విద్యార్థులు మోడీ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఎలుగెత్తి చాటారు. తదనంతరం ఎంబీవికేలో జరిగిన భారీ సభలో మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రిశ్వరరావు, హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఎం నేత డి.కాశీనాథ్, సిపిఐ నేత డి.శంకర్, విద్యార్థి, యువజన నేతలు ప్రసన్న, రామన్న, లెనిన్ బాబు, శివారెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణ, రవిచంద్ర, సోమేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

నేతలు మాట్లాడుతూ

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై విస్పష్టమైన ప్రకటన చేయాలి.రాష్ట్రము నుండి ఎన్నికైన వైసిపి, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు పార్లమెంటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. మోడీ కార్యాలయం ముందే ఆందోళన చేయాలి.రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ మరోసారి హోదా, విభజన హామీల అమలుపై తీర్మానం చేయాలి. ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలి. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ పర్యటనలో హోదా, విభజన హామీ అంశాన్ని గట్టిగా లేవనెత్తాలి.స్వప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలను మిన్నగా ముఖ్యమంత్రి చూడాలి.రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా బిజెపితో జతకట్టే పార్టీలు చరిత్ర హీనులుగా మిగిలిపోతాయి.రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో చేతులు కలిపే ఆలోచనలు చేయటం సిగ్గుచేటు.ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును మోడీ బడా కంపెనీలకు తెగనమ్మడం శోచనీయం. పార్లమెంటులో చేసిన విభజన చట్టాన్ని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను నిరాకరించడం రాజ్యాంగ విద్రోహమే.రాష్ట్రానికి మేలు చేయకపోగా రాష్ట్రంలోని ప్రజల ఆస్తులను మోడీ ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి అదానికీ కట్టబెట్టడం అమానుషం.ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన బిజెపి నేతలు నేడు మాట మార్చటం క్షంతవ్యం కాదు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పాపం మోడీ, జగన్ లదే. పోలవరానికి నిధులు, కడప ఉక్కు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపిన బిజెపికి బుద్ధి చెప్పాలి. అమరావతికి నిధులు ఇవ్వకుండా చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టిన బిజెపికి ఆంధ్రప్రదేశ్ కు పుట్టగతులు లేకుండా చేయాలి. బిజెపితో జతకట్టే పార్టీలకు తగు శాస్తి చేయాలి.వివిధ పార్టీలు నేతలు చేస్తున్న యాత్రలలోను ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాన్ని కూడా ఎజెండాగా చేయాలి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కేంద్రానికి దాసోహమంటుండగా, విద్యార్థి, యువకులు పోరాటం పధంలో నడవటం అభినందనీయం.అవసరమైతే ఢిల్లీలోనూ హోదా, విభజన హామీల అమలుకు ఆందోళన చేపడుతాం.ఇప్పటికైనా వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు కేంద్రం అన్యాయంపై గళం విప్పాలి. ఉమ్మడి పోరులో కలిసి రావాలి. ప్రజాభిష్టాన్ని గౌరవించాలి. వామపక్ష పార్టీలు కేంద్రం ద్రోహం, రాష్ట్ర ప్రభుత్వ లొంగు బాటుపై పోరాడుతున్నాయి. పోరాడుతున్న వారికి సంఘీభావంగా నిలబడుతున్నాయి. మిగిలిన పార్టీలు ఇదే బాటలో నడవాలి. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ, సిపిఐ జిల్లా, నగర కార్యదర్శులు సిహెచ్.కోటేశ్వరావు, జి కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest