2023 మార్చి 4 మరియు 5 తేదీలలో టిపిసిసి అధ్యక్షులు ఎ. రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తున్న సందర్బంగా… ఈ బహిరంగ లేఖ రాస్తున్నాము.
శ్రీయుత గౌరవనీయులైన ఎ. రేవంత్ రెడ్డి గారు టిపిసిసి అధ్యక్షులు
విషయం: గల్ఫ్ వలస కార్మికుల సమస్యల గురించి
ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి గత 52 సంవత్సరాలుగా (1970 నుంచి) గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
నీళ్లు – నిధులు – నియామకాలు & బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి… అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు మలేషియా, సింగపూర్, అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా తదితర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు. వీరందరి సంక్షేమం కోసం ‘గల్ఫ్ బోర్డు’ ఏర్పాటు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవి:
◉ Comprehensive Non-Resident Indians Policy (కాంప్రహెన్సివ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పాలసీ) సమగ్ర ప్రవాస భారతీయుల విధానంలో భాగంగా… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం Gulf Workers’ Welfare Board – GULF BOARD గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలి
మైగ్రేషన్ పాలసీ.. అనగా వలస విధానం. ఎన్నారై పాలసీ… అనగా ప్రవాస భారతీయుల విధానం. ఈ రెండింటిని విస్తృతంగా అధ్యయనం చేసిన విద్యావంతుల బృందం… బలహీనులు (వల్నరబుల్) బ్లూ కాలర్ వర్కర్స్ రక్షణ కొరకు 40 సంవత్సరాల క్రితంఎమిగ్రేషన్ యాక్టు-1983 లో పొందు పరిచిన విషయాలను పరిశీలించింది. అమాయకులైన వలస కార్మికుల రక్షణకు ఆరు అరబ్ గల్ఫ్ దేశాలతో సహా 18 దేశాలను ఈసీఆర్ దేశాలుగా వర్గీకరించిన 1983 లోని ఎమిగ్రేషన్ చట్టం యొక్క ప్రాతిపదిక ప్రకారం… ‘గల్ఫ్ బోర్డు’ ఏర్పాటు చేయాలని మేధావుల బృందం సూచించింది.
◉ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
◉ రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్ట్ నుండి గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగించవద్దు.
◉ అన్ని విద్యా సంస్థలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
◉ ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణం వంటి పథకాలను వర్తింపజేయాలి.
◉ జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టాలి.
◉ గల్ఫ్ కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకం వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాలి. ధరణి పోర్టల్ వలన గల్ఫ్ దేశాలకు వెళ్లిన రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు.
◉ ప్రతి వలస కార్మికుడిని గల్ఫ్ బోర్డులో సభ్యులుగా చేర్చుకొని వారి నుంచి ప్రతీ సంవత్సరం వారి వారి స్థాయిని బట్టి కొంత మొత్తాన్ని వసూలు చేసి పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.
కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవి:
● హైదరాబాద్ లో సౌదీ, యూఏఈ, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
● ప్రవాస భారతీయ బీమా యోజన (PBBY) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణంను కూడా చేర్చాలి. రూ.325 చెల్లిస్తే రెండు సంవత్సరాల కాలపరిమితితో ఇన్సూరెన్స్ ఇస్తారు. ECR పాస్ పోర్టు కలిగినవారికి PBBY ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ECNR వారికి ఇవ్వడం లేదు. పాస్ పోర్ట్ స్టేటస్ తో సంబంధం లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయాలి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
● ఎమిగ్రేషన్ యాక్టు-1983 ప్రకారం… గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి సర్వీస్ చార్జీగా అభ్యర్థి యొక్క 45 రోజుల వేతనం (రూ. 30 వేలకు మించకుండా) మాత్రమే ఏజెంటుకు చెల్లించాలి. దీనిపై 18 శాతం జీఎస్టీ అనగా రూ.5,400 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ని పూర్తిగా రద్దు చేయాలి.
● గల్ఫ్ ఎన్నారైలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా వినియోగించుకునేలా తక్షణమే చర్యలు వేగవంతం చేయాలి.
● గల్ఫ్ లోని ప్రవాస తెలంగాణీయులకు ఒక వేదిక కల్పించడానికి, రాష్ట్రంతో బంధం ఏర్పరచడానిక వార్షిక ప్రవాసి వేడుకను నిర్వహించడానికి ‘గల్ఫ్ ప్రవాసి తెలంగాణ దివస్’ ను జరుపాలి. సమస్యలను చర్చించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వివిధ రంగాలలో సేవలందించిన ప్రవాసీలకు అవార్డులను ప్రధానం చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం & కేంద్ర ప్రభుత్వం – రెండు ప్రభుత్వాలు కలిసి చేయాల్సినవి:
● విదేశాల నుండి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కార్మికుల నైపుణ్యం మరియు అనుభవాన్ని ఉపయోగించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలి.
● జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) ఇవ్వాలి.
● కరోనా సందర్భంగా గల్ఫ్ తదితర దేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడం వారి హక్కు. బాధితుల పక్షాన ప్రభుత్వాలు నిలబడి న్యాయ సహాయం అందించి కార్మికులను ఆదుకోవాలి.
ఇట్లు: స్వదేశ్ పరికిపండ్ల, అధ్యక్షులు, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్. మొబైల్: +91 94916 13129
(ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అనే కార్మిక సంఘం ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్టు 1926 ప్రకారం రిజిస్టర్ చేయబడిన సంస్థ. స్విట్జర్లాండ్ లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తూ… 127 దేశాలలో సభ్యత్వం కలిగిన బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ BWI అనే గ్లోబల్ యూనియన్ ఫెడరేషన్ లో సభ్యత్వం కలిగిన సంస్థ)