రోడ్ల పైకి TSRTC లహరి ఏసీ స్లీపర్ బస్సులు

 

  • టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేస్తున్నాయ్
  • మార్చిలో అందుబాటులోకి 16 ఏసీ స్లీపర్ బస్సులు
  • కొత్త బస్సును పరిశీలించి, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ఆరా సంస్ధ ఎండి ఆరా

హైదరాబాద్ :

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది. ఆయా బస్సులను మార్చి నెల నుండి అందుబాటులోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పటికే సంస్థకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఅర్ ఆదేశాల మేరకు ప్రజా రవాణాను మరింత పటిష్ట పరచి, సేవలను మరింత విస్తరించాలని సంకల్పంతో టిఎస్ ఆర్టీసి ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త నమూనాతో ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, పరిశీలించారు.

బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించ‌గ‌ల‌ద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కృష్ణ కాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఈ బస్సు ప్రత్యేకతలివే..!

12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్‌ వద్ద రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు.

వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు. ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉన్నాయి. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంటుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest