వాచిపోయిన చేతులు చూపించిన పట్టాభి

 

  • జడ్జి ముందు హాజరుపర్చిన పోలీసులు

(కృష్ణాజిల్లా) గన్నవరం:

తెదేపా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, దొంతు చిన్నా, గురుమూర్తి సహా అరెస్టు చేసిన 11 మంది తెలుగుదేశం నేతలను గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు..

స్థానిక అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఎదుట వారిని పోలీసులు హాజరుపర్చారు.

కోర్టుకు వెళ్తూ పట్టాభి వాచిపోయిన చేతులు చూపించారు. చేతులు కమిలిపోయాయని చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలో పట్టాభితో పాటు తెదేపా నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గన్నవరం పీఎస్‌లోనే తెదేపా నేతలకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తన భర్త పట్టాభిరామ్‌ను దారుణంగా హింసించారని ఆయన భార్య చందన ఆరోపించారు. ఉన్నతాధికారుల సహకారంతోనే ఇదంతా జరిగిందని విమర్శించారు. తోట్లవల్లూరు పీఎస్‌లో తన భర్తను ముసుగు ధరించిన ముగ్గురు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి ఇంత ఆందోళనగా ఎప్పుడూ కనిపించలేదన్నారు.

తెదేపా నేతలను కోర్టుకు తరలించే క్రమంలో గన్నవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద తెలుగుదేశం శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు పీఎస్‌కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ కేసులు వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గన్నవరం కోర్టు వద్దకు చేరుకున్నారు.

విజయవాడ

పోలీసుల కళ్ళు గప్పి ఎట్టకేలకు జిజె హెచ్ కు పట్టాభి భార్య చందన చేరుకున్నారు.ఉదయం నుంచి తన భర్తను చూడడం కోసం చందన పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు తన భర్తని కలుసుకున్నానని పట్టాభి భార్య చందన చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest