విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాల సాధనకు సమష్టి కృషి

 

  • జేఈవో సదా భార్గవి

తిరుపతి : టీటీడీ విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి సమష్టి కృషి చేయాలని జేఈవో సదా భార్గవి పిలుపునిచ్చారు. తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం టీటీడీ విద్యాసంస్థల పై ఆమె సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సదా భార్గవి మాట్లాడుతూ టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందించేందుకు కృషియాలని ఆదేశించారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఇతర విద్యా సంస్థల్లో మౌళిక వసతులు అభివృద్ధి చేయాలని చెప్పారు. తద్వారా విద్యార్థుల నుంచి మరింత ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చునని ఆమె అధికారులకు సూచించారు. జియో సహకారంతో రూపొందించిన విద్యార్థుల సాఫ్ట్ వేర్ అన్ని విద్యాసంస్థల్లో అమలు చేయాలని, ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్లు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రణాళికా బద్ధంగా కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు. ఇందుకోసం పాఠశాలలు, కళాశాలవారీగా చదువులో వెనుకబడిన వారిని గుర్తించి, వారి ఉన్నతికి తీసుకోబోతున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని డీఈవో ను ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇక మూడు నెలలే సమయం ఉన్నప్పటికీ, విద్యార్థులకు మోటివేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహించాలన్నారు. ఇందుకోసం నిష్ణాతులైన శిక్షకులను ఉపయోగించుకోవాలని జేఈవో చెప్పారు. శిల్పకళాశాలలో ఏడాదికి కనీసం మూడు సార్లు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా విద్యార్థుల నైపుణ్యం మరింత మెరుగు పరచడానికి ఊతమిచ్చినట్లు అవుతుందని ఆమె అన్నారు. అలాగే తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలోని పుస్తకాలుతెప్పించి వాటిని తెలుగులోకి అనువాదం చేసి బోధించడం ద్వారా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. శిల్ప కళాశాల కాంపౌండ్ వాల్, ఆర్చి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్వీ సంగీత, నృత్య, నాదస్వర కళాశాలలో వాగ్గేయకారుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఉన్న స్టేజిని అవసరాలకుఅనుగుణంగా అభివృద్ధి చేయడంతో పాటు మరుగుదొడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. విద్యార్థిని విద్యార్థుల నైపుణ్యాన్ని మరింత పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కళాశాలల ప్రిన్సిపాళ్ళను ఆదేశించారు.
ఎస్పీ డబ్ల్యు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ అందించి, వారికి మంచి ప్లేస్మెంట్స్ వచ్చేలా చేయడానికి వివిధ కంపెనీలతో ఎంఓయూలు చేసుకోవాలన్నారు. అన్ని కళాశాలల్లో సాఫ్ట్ స్కిల్స్ ను మెరుగుపరిచేలా శిక్షణ అందించాలని డీఈఓ ఆదేశించారు. డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు బధిర, మ్యూజిక్ కళాశాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆడిట్ అబ్జెక్షన్లపై సమీక్షించారు
టీటీడీలోని అన్ని విద్యాసంస్థలకు సంబంధించి న్యూస్ లెటర్ తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల విద్యార్థుల నైపుణ్యం వెలికి తీసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని విద్యాసంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అధ్యాపకులు, సిబ్బంది కృషి చేయాలని ఆమె కోరారు. డీఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ మనోహర్, ఎలక్ట్రికల్ డిఈ సరస్వతి తో పాటు వివిధ కళాశాల ప్రిన్సిపాళ్ళు, ఆడిట్ అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest