విశాఖ ఉక్కు కోసం మహోద్యమం BRS సంకల్పం

 

  • తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటనని స్వాగతిస్తున్నా
  • కుట్రల్ని తిప్పి కొడదాం… విశాఖ ఉక్కుని కాపాడదాం
  • ప్రాంతాలకు అతీతంగా విశాఖ ఉక్కు ఉద్యమం
  • కుట్రపూరిత నష్టాలపై కలిసికట్టుగా పోరాటం
  • విశాఖ ఉక్కు కార్మిక సంఘాలతో త్వరలో భేటీ
  • డాక్టర్ తోట చంద్రశేఖర్, ఏపీ బీఆర్ఎస్ చీఫ్ ప్రకటన

హైదరాబాద్,

తెలుగు ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెలుగు ప్రజలే కాపాడుకోవాల్సిన రోజు వచ్చిందని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పిలుపుచిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలపై తెలంగాణా మంత్రి కె.టి. రామారావు విడుదల చేసిన ప్రకటనని డాక్టర్ తోట చంద్రశేఖర్ స్వాగతించారు. విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకోవడంపై భారత రాష్ట్ర సమితి మాత్రమే స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తోందని, కేటీఆర్ ప్రకటన ఏపీ ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపిందని ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ వెల్లడించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన వివిధ వర్గాల నేతలు, మేధావులు, విద్యావంతులతో చర్చలు జరిపామని అతి త్వరలోనే ఈ అంశంపై స్పష్టమైన ఉద్యమ కార్యాచరణని ప్రకటిస్తామని డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొన్ని శక్తులు కుట్రపూరితంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని, లక్షన్నర కోట్ల ఆస్తులు కలిగిన ఈసంస్థకి పాతిక వేల కోట్లు మాత్రమే రుణాల మానిటైజేషన్ కి అవకాశం కల్పించి, ప్రైవేటు సంస్థలకు మాత్రం 70 వేల కోట్ల రూపాయల వరకు అవకాశం ఇవ్వడం దారుణమైన విషయంగా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తోందని డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. దేశం నిరుద్యోగం కోరల్లోకి జారిపోతోంది, గత మూడు నెలల్లో గరిష్టంగా 7.8 శాతం నిరుద్యోగిత దేశంలో నమోదైనట్టు సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది. 2022లో ఇది మరింత ఎక్కువగా నమోదైంది. కేంద్రం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలే ఈ పరిస్థితులకు కారణమని డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల తెలుగు రాష్ట్రాలే ఎక్కువగా నష్టపోతున్నాయని, దశాబ్దాలుగా ప్రజలకు సేవలందించిన ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లాంటి సంస్థలు ఇప్పటికే కనుమరుగు చేశారని ఇప్పుడు విశాఖ ఉక్కుకి అదే గతి పట్టిస్తే చూస్తూ ఊరుకోబోమని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ హెచ్చరించారు.

విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన అంశం గురించి బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టమైన విధానాన్ని ప్రకటించారని విశాఖ ఉక్కు, ఎల్ఐసీ వంటి సంస్థల్ని ప్రైవేటీకరిస్తే మళ్లీ జాతీయీకరణ చేసే బాధ్యతల్ని బీఆర్ఎస్ తీసుకుంటుందని కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారని, ఇప్పుడు మంత్రి కేటీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ నిబద్ధతని ప్రజలు అర్థం చేసుకుంటారని డాక్టర్ తోట చంద్రశేఖర్ తెలిపారు. ముడిసరుకు, మూలధనం ఇవ్వకుండా విశాఖ ఉక్కు కర్మాగారానికి కృత్రిమ నష్టాలు సృష్టించి, ప్లాంటు మనుగడనే ప్రశ్నార్థకం చేసే ప్రయత్నాల్ని కేంద్రం ముమ్మరం చేస్తోందని, వీటిని ఆపేవరకు బీఆర్ఎస్ ఉద్యమం కొనసాగుతుందని తోట చంద్రశేఖర్ ప్రకటించారు. అతి త్వరలోనే విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలతో భేటీ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో తెలుగు ప్రజలంతా ఏకంకావాలని డాక్టర్ తోట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest