సాప్ట్‌వేర్ రంగంలో దూసుకుపోతున్న గుంటూరు యువకుడు

 

  • అమెరికాలో హైబ్రిడ్ యాప్ పై అధ్యయనం చేస్తున్న జొన్నాదుల ప్రతాప్‌

గుంటూరు

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జొన్నాదుల ప్రతాప్ సాప్ట్‌వేర్ రంగంలో దూసుకుపోతున్నారు. సాప్ట్ వేర్ రంగం క్వాలిటీ విభాగంలో జరుగుతున్న నూతన అభివృద్ధిపై, టెస్ట్ ఆటోమేషన్, మొబైల్ టెస్ట్ ఆటోమేషన్ , లో కోడ్ లేదా నో కోడ్, హైబ్రిడ్ యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫర్ టెస్టింగ్ లాంటి అనేక అంశాలను అమెరికాలో ఆయన అధ్యయనం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై యువతకు క్వాలిటీ ఎష్యూరెన్స్,సాప్ట్ వేర్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన మెళకువలను తెలియజేస్తుంటారు.
జొన్నాదుల వీరరాఘవులు, అరుణకుమారిల రెండవ సంతానంగా ప్రతాప్ 1991లో జన్మించారు. మంగళగిరిలోని చింతక్రింది కనకయ్య ఉన్నతపాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. విజయవాడ నలంద జూనియర్ కళాశాల లో ఇంటర్, నంబూరులోని వాశిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీవీఐటీ)లో కంప్యూటర్ సైన్సు లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత 2013 నుంచి 2015 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ఆటోమేషన్ విభాగంలో ఇంజనీర్ గా పని చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సిలికాన్ వాలీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత వాషింగ్టన్ డీసీలోని యూనివర్సిటీ ఆఫ్ ద పోటోమాక్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఉద్యోగరీత్యా అక్కడే స్థిరపడ్డారు. 2017 నుంచి 2021 వరకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజల్స్ మెట్రోపోలిటన్ ప్రాంతంలోని ఈఎల్ సెగుండో నగరంలోని ఏటీ అండ్ టీ కంపెనీలో సీనియర్ క్యూఏ ఇంజనీర్ గా పని చేశారు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ మెట్రోపోలిటన్ ప్రాంతంలోని సముద్రతీర నగరం శాంటామోనికాలోని క్రాకిల్ ప్లస్ సంస్థలో క్యూఏ ఇంజనీర్ గా చేస్తున్నారు.
సాఫ్ట్ వేర్ రంగంలో అతని ప్రతిభకు, వృత్తిపట్ల అతని అంకితభావానికి గుర్తింపుగా 2022 సంవత్సరానికి ఎమర్జింగ్ టెస్టింగ్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక చేశారు. గత నవంబర్ లో బెంగళూరులో జరిగిన నెస్ట్ జనరేషన్ టెస్టింగ్ అంతర్జాతీయ సదస్సులో కాలిఫోర్నియాలోని మిషన్ హిల్స్ ప్రధాన కేంద్రంగా గల అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కార్పొరేషన్ యూనికాం గ్లోబల్ సంస్థ ప్రతాప్ కు ఈ అవార్డు అందజేసింది. అత్యుత్తమ నాయకత్వ ప్రతిభ, టెస్టింగ్ రంగంలో అద్వితీయమైన కృషి చేసిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఇది. టెస్టింగ్ రంగంలో కొత్తవారికి, పదేళ్ల లోపు అనుభవం గల వృత్తిలో సమర్థులు, అసాధారణ నైపుణ్యం, అత్యంత ప్రతిభ గల నిపుణుల కోసం ఈ అవార్డుని ఏర్పాటు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest