అమరావతి :
రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ, అవ్వలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్ర పోషిస్తున్న మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం అని ముఖ్యమంత్రి అన్నారు.
2019లో అధికారం చేపట్టిన నాటి నుంచి తమ ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సాధికారతల పట్ల దేశంలోని మరే ప్రభుత్వమూ పెట్టనంతగా దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి అన్నారు. అంతే కాకుండా జగనన్న అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, 30 లక్షల ఇళ్ల పట్టాలు–22 లక్షల ఇళ్ల నిర్మాణం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ సంపూర్ణ పోషణ వంటి పథకాలతో గర్భస్త శిశువు నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అని ముఖ్యమంత్రి అన్నారు. అంతే కాకుండా వారి రక్షణను, భద్రతను దృష్టిలో ఉంచుకుని దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లతో ఆడబిడ్డల రక్షణలో అందరికన్నా మిన్నగా అడుగులు ముందుకు వేశామని ముఖ్యమంత్రి అన్నారు.
21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే అవతరించేలా ప్రతి ఒక్క నిర్ణయం తీసుకున్న తమ ప్రభుత్వం, రాజకీయ పదవుల్లో కూడా చట్టాలు చేసి మరీ సగభాగం ఇచ్చిందని సీఎం అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం, మొత్తంగా సమాజం ఆడబిడ్డల పట్ల మరింత గౌరవం, శ్రద్ధ కనబర్చే నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.