ఉత్సాహంగా ఏఎన్ యూ లా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

 

ఏఎన్ యూ క్యాంపస్, ఫిబ్రవరి 5:

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్ లా కాలేజ్ లో న్యాయశాస్త్రం అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం డైక్ మెన్ ఆడిటోరియంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు ఆత్మీయ అతిథులుగా గురుదేవులు ఎఎన్ యూ పూర్వ వైస్ చాన్సలర్ ఆచార్య వై.హరగోపాల్ రెడ్డి, ఆచార్య ఎన్.రంగయ్య, ఆచార్య ఎ.సుబ్రహ్మణ్యం, ఆచార్య కె.ఎం.హెచ్ రాయప్ప, ఆచార్య ఎల్.జయశ్రీ, ఆచార్య భాస్కరరావు, పూర్వ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.రామకృష్ణప్రసాద్, జస్టిస్ వి.ఆర్.కె.కృపాసాగర్ లు విచ్చేశారు. వేదికపైన తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులనే ఆశీనులను చేసి హైకోర్టు న్యాయమూర్తులిద్దరు కూడా తోటి పూర్వవిద్యార్థులతో కలిసి కూర్చుని కార్యక్రమాన్ని తిలకించడం విశేషం.

జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆచార్య హరగోపాల్ రెడ్డి కీలక ఉపన్యాసం చేశారు. యూనివర్సిటీలో లా కోర్సు ప్రారంభం నుంచి చోటుచేసుకున్నముఖ్యమైన విశేషాలను సందోర్భచితంగా వివరిస్తూ పూర్వ విద్యార్థుల్లో హుషారు తెప్పించారు. ఏఎన్ యూ క్యాంపస్ లో లా మొదటిబ్యాచ్ విద్యార్థి అయిన జస్టిస్ ఎన్.వి.రమణ దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వర్తించడం మనందరికీ గర్వకారణమన్నారు. దేశంలోనే మన లా డిపార్టుమెంటుకు మంచి గుర్తింపు ఉందని, ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులెందరో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. లా పూర్వవిద్యార్థులు అధిక సంఖ్యలో నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోవడం విశేషంగా గురుదేవులు తమ ప్రసంగాల్లో వ్యక్తం చేశారు. జస్టిస్ రామకృష్ణప్రసాద్, జస్టిస్ కృపాసాగర్ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. అలాగే, లా మొదటి బ్యాచ్ విద్యార్థి, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా నాటి తీరుతెన్నులను సోదాహరణంగా తెలియజేశారు. విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా కాలేజ్ వైస్ చాన్సలర్ సూర్వప్రకాశ్, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ విష్ణువర్ధన్ తదితరులు ప్రసంగించారు. ఇక ముక్తకంఠంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల లా కోర్సును పెట్టాలని కోరారు.

ఈ కార్యక్రమ నిర్వహణలో ముఖ్యులైన పూర్వ విద్యార్థి, ఏపీ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబరు డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాతలను పూర్వ విద్యార్థుల తరఫున ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ కలయికకు యూనివర్సిటీలో లా ప్రారంభించిన 1979 నుంచి చివరి బ్యాచ్ 1998 వరకు చదివిన పూర్వవిద్యార్థుల్లో చాలామంది విచ్చేయడం విశేషం. తెలుగురాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లోనూ స్థిరపడిన పలువురు ప్రముఖులు విచ్చేసి లా పూర్వ విద్యార్థులతో కలసి సందడి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest