నిర్మల హైస్కూల్‌లో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

విజయవాడ : చిన్నారులలోని వినూత్న ఆలోచనలకు కార్యరూపం కల్పిస్తూ, వారిలో మరింత ఉత్సాహం పెంపొందించే క్రమంలో సైన్సు ఎగ్జిబిషన్ లు సహకారం అందిస్తాయని నిర్మలా హైస్కూల్ మాజీ ప్రిన్సిపాల్ నాన్సీ డిసౌజా అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడ నిర్మల హైస్కూల్‌లో మంగళవారం సైన్స్ ఎక్స్‌పో 2023 నిర్వహించారు. ఉపాధ్యాయుల సహాయంతో 6 నుండి 9 తరగతులకు చెందిన 400 మంది విద్యార్థులు సుమారు 120 ప్రదర్శనలను సిద్ధం చేశారు. ఈసందర్భంగా డిసౌజా మాట్లాడుతూ కరోనా తదనంతర పరిస్ధితుల కారణంగా, విద్యార్థులు విద్య పట్ల ఆసక్తిని కోల్పోయి, చదువుల పట్ల నిష్క్రియాత్మకంగా మారారన్నారు. ఎక్కువ సమయం విద్యార్థులు టివి, సెల్ ఫోన్ లపై ఆసక్తి చూపుతూ కెరీర్‌ను పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పరిస్ధితులను అధికమించి వారు తిరిగి చదువులపై ఆసక్తి చూపేలా తాము సైన్సు ఎగ్జిబిషన్ ను తీర్చిదిద్దామన్నారు.

ప్రిన్సిపాల్ గిబీ ఆంటోనీ మాట్లాడుతూ జీవవైవిధ్య పరిరక్షణ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, కాలుష్య నివారణ వంటి అంశాలపై చిన్నారులు తమ ప్రతిభను చూపుతూ ప్రదర్శనాంశాలను చూపారన్నారు. మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాలు, సేంద్రియ వ్యవసాయం, వర్షపు నీటి వినియోగం తదితర ఇతివృత్తాల గురించి చిన్నారులు వివరించారు. రివర్ వాటర్ లెవల్ అలారం, టెస్లా కాయిల్ వంటి వినూత్న ప్రదర్శనలు సైతం ఈ సైన్సు ఎగ్జిబిషన్ లో చోటు చేసుకోగా, గణిత అనువర్తనాల నమూనాలు ఆసక్తిని కలిగించాయి. విద్యార్ధుల తల్లిదండ్రులు సైతం ఉత్సాహంగా పాల్గొనగా, సహాయ ప్రిన్సిపాల్ మేరీ మాగ్డలీన్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేరతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest