పులివెందులలో కాల్పుల కలకలం

పులివెందుల

వైఎస్సార్‌ జిల్లా, సీఎం జగన్‌ సొంత నియోజక వర్గం పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. భరత్‌ కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి తన తుపాకీ తీసుకొని ఇద్దరు వ్యక్తులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన దిలీప్‌, మహబూబ్‌ బాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే భరత్‌ కుమార్‌ యాదవ్‌, పులివెందుల పట్టణంలోని గొర్రెల వ్యాపారి దిలీప్‌ మధ్య ఆర్థికలావాదేవీలు ఉన్నాయి. గత వారం రోజులుగా ఇద్దరూ డబ్బుల విషయంలో గొడవ పడుతున్నట్టు సమాచారం. దిలీప్‌.. భరత్‌కుమార్‌ యాదవ్‌కు అప్పు ఉండటంతో ఆ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పులివెందులలోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఇద్దరూ తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగడంతో.. హుటాహుటిన ఇంట్లోకి దూసుకెళ్లిన భరత్‌ కుమార్‌ యాదవ్‌ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దిలీప్‌ ఛాతి, నుదిటిపై కాల్పులు జరిపినట్టు సమాచారం.

ఆ సమయంలోనే అతడి పక్కనే ఉన్న దిలీప్‌ స్నేహితుడు మహబూబ్‌ బాషా అడ్డుకొనే ప్రయత్నం చేయగా, అతడిపైనా కాల్పులు జరిపినట్టు బాధితులు చెబుతున్నారు. గాయాలతో వీరిద్దరూ ఆలయం మెట్ల వద్ద కింద పడిపోవడంతో భరత్‌కుమార్‌ యాదవ్‌ అక్కడి నుంచి తుపాకీతో పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో బాధితులను చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దిలీప్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కొద్ది సేపటి క్రితమే అతడిని ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. గతంలో వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని, సీబీఐ విచారణకు హాజరైన భరత్‌ కుమార్‌ యాదవ్‌కు అసలు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భరత్‌ కుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest