బిల్లు మంజూరుకు రూ.20 వేలు డిమాండ్
విజయనగరం, జనవరి 31: ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు ఏం బుక్ ఎంటర్ చేసి, బిల్లులు మంజూరు చేయడానికి రూ.20 వేలు లంచం తీసుకుంటూ దత్తిరాజేరు మండలం ఆర్ డబ్ల్యూ ఎస్ జేఈఈ ధనుంజయరావు ఏసీబీ అధికారుల వలలో పడ్డారు. మంగళవారం సాయంత్రం విజయనగరంలోని ఉడా కాలనీ గౌతమీ నగర్ అపార్ట్మెంట్లోని ఆయన నివాసం గ్రౌండ్ ప్లోర్ లో బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస సర్పంచ్ భర్త కర్రోతు శ్రీనివాసరావు వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు మేరకు
ధనుంజయ రావు గతంలో బొండపల్లి మండలంలో ఆర్ డబ్ల్యూ ఎస్ జేఈఈ గా పని చేసిన కాలంలో మరువాడ కొత్తవలస సర్పంచ్ భర్త కర్రోతు శ్రీనివాసరావు కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేశారు. వాటికి సంబంధించిన ఏం బుక్ రికార్డుల్లో ఎంటర్ చేసి, బిల్లులు మంజూరు చేయాల్సిన జేఈఈ ధనుంజయ్ రావు అటు తరువాత దత్తిరాజేరు మండలంకి బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ బిల్లులు పెండింగ్ లో ఉండి పోవడంతో శ్రీనివాసరావు, జేఈఈ ధనుంజయ రావును సంప్రదించగా ఆయన రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాసరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల ముందస్తు వ్యూహంతో మంగళవారం సాయంత్రం శ్రీనివాస్ రావు, జేఈఈ ధనుంజయరావు నివాసంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో లంచం సొమ్మును అందచేశారు. అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు హఠాత్తుగా దాడి చేసి, లంచం తీసుకున్న సొమ్ముతో పాటు ధనుంజయ రావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.