- ప్రతిభ కనబరిచిన 245 మంది విద్యార్థులకు అఛీవర్ అవార్డులు ప్రదానం
- ఇతర విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకే సక్సెస్ మీట్,
- జేఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి
విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ళు , అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర విభాగాల అధికారుల సమష్టి కృషితోనే టీటీడీ విద్యాసంస్థలకు జాతీయస్థాయి గుర్తింపు లభించిందని జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు.
తిరుపతి మహతి ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం స్టూడెంట్స్ సక్సెస్ మీట్ – అఛీవర్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అకడమిక్స్, ఎన్.సి.సి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్, కో కరికులర్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ప్లేస్మెంట్స్ తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 245 మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సందర్భంగా 10 గ్రాముల వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, ఇటీవల టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ఏ ప్లస్ గ్రేడ్, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలకు ఏ గ్రేడ్,
శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్.బి.ఏ గుర్తింపు లభించాయని చెప్పారు. ఈ సందర్బంగా ఆయా కళాశాలల అధ్యాపకులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. టీటీడీ సామాజిక బాధ్యతగా 33 విద్యాసంస్థల్లో 20 వేల మందికి పైగా విద్యార్థులకు విద్యాదానం చేస్తోందని తెలిపారు. వీటిలో డిగ్రీ, పీజీ కళాశాలలు, జూనియర్ కళాశాల, పాఠశాలలు, సంగీత, నృత్య కళాశాల, శిల్పకళాశాల, అనాథ విద్యార్థుల కోసం బాలమందిరం నడుస్తున్నాయని తెలియజేశారు. ప్రస్తుతం అవార్డులు అందుకున్న విద్యార్థులను ఇతర విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని తమకిష్టమైన అంశాల్లో రాణించి అఛీవర్ అవార్డులు అందుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
ప్రత్యేక అతిథిగా విచ్చేసిన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు
కుప్పా విశ్వనాథ శర్మ మాట్లాడుతూ నిజాయితీతో కష్టపడితే విజయం సిద్ధిస్తుందన్నారు . ఈ విజయానికి ఎంతో గొప్ప శక్తి ఉంటుందని తెలియజేశారు. గురువుల ద్వారా నేర్చుకునే విద్య మనిషిని గొప్పవాడిని చేస్తుందన్నారు. సత్యానికి కట్టుబడి కష్టపడి పని చేసే వ్యక్తికి సృష్టి మొత్తం సహకరిస్తుందని తెలియజేశారు. పెద్దవాళ్లపై గౌరవం, భగవంతునిపై భక్తితో విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్
శేషశైలేంద్ర మాట్లాడుతూ శ్రీకృష్ణార్జునుల్లాగా గురు శిష్యుల సంబంధం ఉండాలన్నారు. అస్త్రాలను పక్కన పెట్టిన అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని బోధించి యుద్ధానికి సిద్ధం చేసినట్టుగా, విద్యార్థులకు గురువులు కర్తవ్యబోధ చేయాలని సూచించారు. అదే విధంగా వేదధాముడు-ఉద్దానధాముడు, ఉపమన్యుడు, నచికేతుడు తదితర పురాణాల్లోని పాత్రల ద్వారా గురుశిష్యుల గొప్ప సంబంధాన్ని తెలియజేశారు.టీటీడీ విద్యాశాఖ అధికారి డా. ఎం.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ విద్యా విభాగం ఆధ్వర్యంలో మొదటిసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది చక్కగా రాణించాలని కోరారు.శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి మాట్లాడుతూ టీటీడీ విద్యా సంస్థలకు ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందన్నారు. సమర్థులైన అధికారుల పర్యవేక్షణలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని కోరారు. టీటీడీ విద్యా విభాగం సలహాదారు ఎల్ఆర్.మోహన్ కుమార్ రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ ప్రసంగించారు. ఏపీఆర్ఓ కుమారి పి.నీలిమ, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డా. కృష్ణవేణి వ్యాఖ్యాతలుగావ్యవహరించారు.అంతకుముందు కళాశాలలు, పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.