సీఎంలందరి కంటే ఏపీ సీఎం సంపాదన ఎక్కువ:పవన్ కల్యాణ్

అమరావతి :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శల వర్షం కుపించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి పాలనలో ఉన్నపేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ దుయ్యబట్టారు. దేశంలోనే సీఎం జగన్ క్లాస్ వేరంటూ వరుస ట్వీట్లతో ఎద్దేవా చేశారు. ‘ఆక్సిమోరాన్- అంటే విరుద్ధమైన పదాల కలయిక. ఉదాహరణకు దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రి పాలనలో పేద ప్రజలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన సీఎం సంపద దేశంలో మిగతా సీఎంలందరి మొత్తం సంపాదన కంటే ఎక్కువ. ఏపీ సీఎం క్లాస్ వేరు’ అని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వర్గాలకు తావు లేదని, వైసీపీ రాజ్యంలో ప్రజలంతా బానిసలుగా మార్చుకున్నారని విమర్శించారు.

‘భూమి నుంచి ఇసుక వరకు, మద్యం నుంచి గనుల వరకు, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకు ఏపీ నుంచి ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలో ఉంది. ఇది నిజంగా క్లాసిక్’ అని మరో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజల జీవితాలు, గౌరవం, కష్టం వంటివి కొంతమందికి అమ్ముడుపోయాయని, మధ్యతరగతి కుటుంబాలు రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. వైసీపీ వారిని పన్ను చెల్లించే వారిగానే చూస్తోందన్నారు.

‘పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు.. ఇదో మాస్టర్ క్లాస్. వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల స్వర్గాన్ని ఆంధ్రానికి తీసుకొచ్చినప్పుడు ఇంకా దావోస్ ఎవరికి కావాలి. మన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి ఇప్పటికే నూడుల్స్ సెంటర్, చాయ్ పాయింట్లు ప్రారంభిస్తున్నారు. ఇక ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడం కోసం వేచి చూడాలి. ఇది కూడా మరో క్లాస్ యాక్ట్. అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి కామ్రేడ్ చారు మజుందార్, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి . కామ్రేడ్ పుచ్చలిపల్లి సుందరయ్య వంటి ‘క్లాస్ వార్’ గురించి మాట్లాడుతున్నారు. ఇదేం చోద్యం’ అని పవన్ ట్వీట్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest