హైదరాబాద్ , ఫిబ్రవరి 15 :
పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ మల్లి కేసీఆర్ గూటికి చేరనున్నట్టు నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న వివేక్ బి ఆర్ ఎస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు పెద్దపల్లి నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. బీజేపీలో కీలక పదవిలో ఉన్నప్పటికీ, పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందువల్ల ఆయన బి ఆర్ ఎస్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బి ఆర్ ఎస్ పెద్దపెల్లి ఎంపీ గా ఉన్న బోర్లకుంట వెంకటేష్ ధర్మపురి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. దీంతో బి ఆర్ ఎస్ కు వివేక్ వస్తే పెద్దపల్లి ఎంపీగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కొందరు ముఖ్య కార్యకర్తలు సలహా ఇచ్చినట్టు సంచరం. అంతేకాదు బి ఆర్ ఎస్ లోకి వెళ్లేందుకు వివేక్ ఆ పార్టీ పెద్దలతో మంతనాలు కూడా జరిపారని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పెద్దపల్లి నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. ఎవరి నోటా విన్నా ఇదే చర్చ జరుగుతోంది. వివేక్ ఇప్పటికే మూడు పార్టీలు మారారు. కాంగ్రెస్ ఎంపీగా తెలంగాణ ఇచ్చిన సమయంలో పని చేసిన వివేక్ 2014 లో బాల్క సుమన్ చేతిలో ఓడిపోయాడు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ పోటీ చెయలెదు. అప్పటికే టి ఆర్ ఎస్ నుంచి బయటికి వచ్చి తరువాత బీజేపీలోకి వెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడం. సుమారు పదేళ్లుగా వివేక్ అధికారానికి దూరంగా ఉండటం వంటి కారణాలతో పాటు , బీజేపీలో చేరిన తరువాత వివేక్ పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దగా తిరగడం కూడా లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇవన్నీ కారణాలను సమీక్షించుకుంటే బీజేపీ బరిలో దిగితే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది. కానీ అక్కడ పోటీ చేసే వివేక్ సోదరుడు వినోద్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతున్నాడు. అలాంటప్పుడు బీజేపీ నుంచి ఎంపీ గా వివేక్ ను గెలిపించామని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న వినోద్ ఎలా చెప్పగలడు? అనేది కూడా కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తరువాత బీజేపీలో ఉంది ఓడిపోవడం కంటే బి ఆర్ ఎస్ లోకి వెళ్లి పెద్దపల్లి ఎంపీగా గెలవడమే ఉత్తమమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. టి ఆర్ ఎస్ కాస్త బి ఆర్ ఎస్ గా మారిన తరువాత ఎంపీగా పోటీ చేసే నేతల సంఖ్య పెరుగుతోందని బి ఆర్ ఎస్ నేతలు అంటున్నారు