నాటునాటుకు ఆస్కార్ – అవార్డు అందుకున్న చంద్రబోస్, కీరవాణి

లాస్ ఏంజెల్స్ :
లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకల్లో తెలుగు సినిమా తళుక్కుమంది. ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరిలో నాటు నాటు పాటకు ఆస్కార్ లభించింది. గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి లకు ఆస్కార్ అవార్డును బహుకరించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ విజేతగా నిలిచింది. తెలుగు సినిమా చరిత్రలో ఇది తొలి ఆస్కార్ అవార్డు. ఇండియన్ సినిమా చరిత్రలో కూడా రెండో ఆస్కార్ అవార్డు ఇది. (13-03-2023 ) సోమవారం భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 5. 30 గంటలకు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదికపై విజేతలను ఆర్ ఆర్ ఆర్ అని పిలిచారు. అవార్డు అందుకున్న కీరవాణి వేదికపై తన రాజమౌళి, తన ఫామిలీ, దేశ ప్రజలను పొగుడుతో చిన్న పాటను ఆలపించారు. అయితే ఈ ఆస్కార్ అవార్డు రాడానికి ఎనభై కోట్లు ఖర్చు పెట్టారని ఇటీవల సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. అంతేకాదు. అటు అల్లూరి సీతారామ రాజు, ఇటు కుమ్రంభీం చరిత్రను వక్రీకరించి సినిమా తీశారని విమర్శలు కూడా లేకపోలేదు.
ప్రసంశలు
ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్ , కీరవాణీల ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు ప్రశంశలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇతర సెలబ్రిటీలు కూడా ఆస్కార్ అవార్డు అందుకున్న వారికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

కృష్ణంరాజు చిరకాల స్వప్నం నెరవేరింది: సతీమణి శ్యామలా దేవి

ఆస్కార్స్ విషయంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు ఆయన సతీమణి శ్యామలాదేవి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ ఆస్కార్ నామినేషన్ అందుకోవడమే కాదు, సినిమాలోని ‘నాటు నాటు’ ఆస్కార్ అందుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట అవార్డు గెలుచుకోవడం, ఆస్కార్ వేదికపై కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకోవడం చూస్తుంటే నాకు కృష్ణంరాజు గారు చెప్పిన మాటలే గుర్తు వచ్చాయి. ఆయన ఎప్పుడూ తెలుగు సినిమాకి ఆస్కార్ రావాలని చాలా బలంగా కోరుకుంటూ ఉండేవారు.. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత ఈ సినిమాకి అనేక అవార్డులు వస్తాయని ఆయన ముందే ఊహించారు. అలాంటి కృష్ణంరాజు  బలమైన కోరికను రాజమౌళి అండ్ టీం నెరవేర్చింది. ఈ సినిమా చేసిన రాజమౌళి కి నిర్మాత దానయ్య కి శుభాభినందనలు. ఈ నాటు నాటు సాంగ్ మ్యూజిక్ అందించిన కీరవాణి కి సాహిత్యం అందించిన చంద్రబోస్, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరికీ కంగ్రాట్యులేషన్స్. ఈ సాంగ్ కి స్టెప్పులు వేసిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వారి చేత స్టెప్పులు వేయించిన ప్రేమ్ రక్షిత్ లకు దీవెనలు.. ఈ పాట కోసం మీ అందరి కష్టం పాటకు ఇలాంటి గొప్ప అవార్డు తెచ్చి పెట్టేలా చేసింది. తెలుగు సినిమా ఇక్కడతో ఆగకుండా మరింత ముందుకు వెళ్లి మరిన్ని ఆస్కార్ అవార్డులు రాబోయే కాలంలో తీసుకురావాలని కోరుకుంటూ మీ శ్యామలా దేవి.

భారతీయులు గర్విస్తున్న క్షణాలివి

• ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు

భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర సంగీత దర్శకులు  ఎం.ఎం.కీరవాణి కి, గీత రచయిత  చంద్రబోస్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంలో ‘నాటు నాటు…’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు… అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది.
ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు  ఎస్.ఎస్.రాజమౌళి కి ప్రత్యేక అభినందనలు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన  ఎన్.టి.ఆర్.,  రాంచరణ్, గాయకులు  రాహుల్ సిప్లిగంజ్,  కాలభైరవ, నృత్య దర్శకులు  ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత  డి.వి.వి.దానయ్యలకు అభినందనలు. ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుంది.

(పవన్ కళ్యాణ్)

ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో.. నాటు నాటు పాటకి.. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న.. దర్శకుడు రాజమౌళి గారికి.. కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి.. రామ్ చరణ్ గారికి.. జూనియర్ N.T.R గారికి..విజయేంద్ర ప్రసాద్ గారికి.. RRR team కి..
తెలుగు దర్శకుల సంఘం తరపన.. హృదయపూర్వక శుభాకాంక్షలు.
వై. కాశీ విశ్వనాధ్
ప్రెసిడెంట్,
తెలుగు దర్శకుల సంఘం.

కీరవాణి- చంద్రబోస్ లకు ఫిలిం క్రిటిక్స్ అభినందనలు

ఆర్ ఆర్ ఆర్ సినిమా తెలుగు తెరపై ఓ చరిత్ర సృష్టించింది. అంతేకాదు అంతర్జాతీయ వేదికపై కూడా హిస్టరీ క్రియేట్ చేసింది. నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరి కింద ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినిమా పతాక ఖ్యాతిని ప్రపంచం నలుమూలల రెపరెపలాడించారు ఎం ఎం కీరవాణి , చంద్రబోస్. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో పాట రాసిన చంద్రబోస్ , సంగీతం సమకూర్చిన ఎం ఎం కీరవాణి లు ఆస్కార్ అవార్డు అందుకోవడం పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేస్తూ , వారిని హృదయ పూర్వకంగా ప్రశంసిస్తోంది. తెలుగు సినిమాను ప్రపంచ వేదికపైకి ఆవిష్కరించిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అభినందిస్తోంది .

ఇట్లు
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్
అధ్యక్షుడు సురేష్ కొండేటి
ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మి నారాయణ

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest