విశాఖ:
విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs AUS) భారత్ ఘోర పరాభవం ఎదుర్కొంది. ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. బ్యాటింగ్‌లో తడబాటుకు గురైన టీమ్ఇండియా. బౌలింగ్‌లోనూ ఆసీస్ బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమైంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ మాట్లాడారు.
117 పరుగులు.. చాలా తక్కువ: రోహిత్
‘‘మ్యాచ్ ఓడిపోతే చాలా నిరుత్సాహం ఉంటుంది. తొలుత బ్యాటింగ్‌లో మేం సరిగా ఆడలేదు. స్కోరుబోర్డుపై సరిపోయేనన్ని పరుగులు పెట్టలేకపోయాం. ఈ పిచ్ మీద 117 పరుగులు చేయడం సరైంది కాదు. వరుసగా వికెట్లను కోల్పోవడం వల్ల మేం అనుకున్న విధంగా స్కోరు చేయలేకపోయాం. తొలి ఓవర్‌లోనే గిల్ ఔట్ కావడం.. ఆ తర్వాత నేను, విరాట్ కాసిన్ని పరుగులు రాబట్టినా సరిపోలేదు. వెనువెంటనే వికెట్లు పడటం మాకు నష్టం చేసింది. అదే మమ్మల్ని వెనుకడుగు వేసేలా చేసింది. ఇవాళ మా రోజు కాదు. స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కొత్త బంతిని స్వింగ్ చేయడం వల్ల బ్యాటర్లకు ఇబ్బందిగా మారిపోయింది. మిచెల్ మార్ష్ అద్భుతమైన బ్యాటర్. పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి దూరం చేశాడు’’ అని రోహిత్ తెలిపాడు.
చాలా త్వరగా ముగుస్తుందనుకోలేదు: స్మిత్
‘‘కేవలం 37 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. ఇంత త్వరగా ముగిస్తుందని అస్సలు ఊహించలేదు. కొత్త బంతితో స్టార్క్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఆరంభం చాలా బాగుంది. వికెట్ ఎలా ఉంటుందో తొలుత అంచనా వేయలేదు. లక్ష్యం ఎంత ఉంటే సరిపోతుందో కూడా ఆలోచించలేదు. మా నైపుణ్యంతో టీమ్‌ఇండియాపై ఒత్తిడి తేవాలని భావించాం. అదే ప్రణాళికను అమలు చేశాం. ఛేదనలో హెడ్, మార్ష్ అదరగొట్టేశారు. గత మ్యాచ్‌లోనూ మార్ష్ రాణించాడు. కానీ, ఓడిపోయాం.. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించాం. ఇక సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను పట్టడం బాగుంది. క్యాచ్ ఆఫ్ ది సెంచరీ అని అనుకోవడం లేదు. హార్దిక్ వంటి పెద్ద వికెట్‌ను పెవిలియన్‌కు చేర్చడం సంతోషంగా ఉంది’’ అని స్టీవ్ స్మిత్ చెప్పాడు.