న్యూ ఢిల్లీ
మోడీ ఇంటిపేరుతో ఉన్న వాళ్ళు దొంగలు అని 2019ఎన్నికల సందర్బంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తు తీర్పు చెప్పింది. ఈ తీర్పు అమలు జరగకముందే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని అనర్హుడిగా ప్రకటించింది పార్లమెంట్ కమిటీ. దీంతో బీజేపీ , కాంగ్రెస్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. రెండేళ్లు జైలుశిక్ష అనుభవించిన వాళ్ళెవరూ మరో ఆరేళ్ళ పాటు రాజకీయంగా పోటీ చెయ్యడానికి అర్హులు కాదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాదన ఏమిటంటే సూరత్ కోర్టు వేసిన జైలు శిక్ష ఇంకా అమలు జరగలేదు. ఇదే అదనుగా చూసుకుని రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించారంటే కేంద్రం రాహుల్ గాంధీ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఏ ఐ సి సి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండి పడ్డారు. బీజేపీకి మూడిందని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన రాహుల్ గాంధీ పై ఇది కేవలం కక్ష పూరితమైన ధోరణి తప్ప మరొకటి కాదని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర తో ఆయనకు మంచి పేరు వచ్చిందని, అది తట్టుకోలేకే బీజేపీ ఇలా చేస్తోందని ఖర్గే ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ లో ఆందోళన చేశారు. పార్లమెంట్ బయట కూడా కాంగ్రెస్ నేతలతో పాటు పలు పార్టీల నేతలు ఆందోళనకు దిగారు.
రాహుల్ కు మద్దతుగా బి ఆర్ ఎస్
రాహుల్ గాంధీకి మద్దత్తుగా బి ఆర్ ఎస్ కూడా నిలిచింది. బీజేపీ , మోడీని నిత్యం తూర్పార పడుతున్న బి ఆర్ ఎస్ నేతలు అందరూ ఈ వ్యవహారంలో బీజేపీని తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాహుల్ కు మద్దత్తుగా బి ఆర్ ఎస్ మంత్రులు సైతం ప్రకటనలు విడుదల చేశారు. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఇతర నాయకులూ సైతం బీజేపీపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.