నివాసాన్ని ఖాళీ చేయాలంటూ రాహుల్‌ గాంధీకు నోటీసులు

దిల్లీ:

అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై రాహుల్‌ మంగళవారం స్పందించారు. అధికారుల ఆదేశాలను తాను తప్పకుండా పాటిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయ అధికారులు ఆయన లేఖ రాశారు.

‘‘12- తుగ్లక్‌లేన్‌లోని నా నివాసాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ పంపిన లేఖ అందింది. అందుకు కృతజ్ఞతలు. ప్రజల తీర్పుతో నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై నేను ఈ బంగ్లాలో ఉన్నాను. ఇక్కడ నాకు చాలా ఆనందకర జ్ఞాపకాలున్నాయి. నా హక్కులకు భంగం కలగకుండా.. లేఖలో పేర్కొన్న విధంగా వ్యవహరించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. అది నా బాధ్యత. బంగ్లాను ఖాళీ చేస్తా’’ అని రాహుల్‌ తన లేఖలో వెల్లడించారు.

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో నిబంధనల ప్రకారం.. నెల రోజుల్లోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 12- తుగ్లక్‌లేన్‌లోని అధికార బంగ్లాను ఏప్రిల్‌ 22లోగా ఖాళీ చేయాలంటూ రాహుల్‌కు లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపైనే రాహుల్‌ స్పందించారు. మరోవైపు, లోక్‌సభ సభ్యుడిగా రాహుల్‌కు ఉండే ప్రయోజనాలన్నింటినీ కూడా అధికారులు పునఃపరిశీలిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest