ఢిల్లీ
జాతీయ మీడియాలో సింహభాగం అంబానీ, అదానీ గుప్పిట్లో ఉన్న విషయం తెలిసిందే. ఫలితంగా ఇతర పార్టీలకు సంబంధించిన వార్తలు, విశేషాలు నేషనల్ మీడియాలో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ అంశాన్ని గమనించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన నగరాల్లో సొంతంగా పత్రికను పెట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దేశంలోని సుమారు పది, పదిహేను ప్రధాన రాష్ట్రాల్లో మీడియా సంస్థను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన సమస్యలను ఎత్తి చూపెడుతూ వాటిని పరిష్కిరంచాలని చూపెట్టే విధంగా ఈ పత్రిక పని చేస్తుందని సమాచారం. ఈ క్రమంలో నమస్తే ఢిల్లీ, నమస్తే ముంబై వంటి పేర్లతో పత్రికలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది. అయితే, ఆయా పత్రికలు స్థానిక భాషల్లో ఉంటేనే ప్రజలకు మరింత చేరువ అవుతామనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దీంతో, ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీ భాషలో పత్రికను పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
లోక్ సభలో కేవలం 24 మంది ఎంపీలున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా లభించిన విషయం తెలిసిందే. ఈ సంఖ్య వచ్చే ఎన్నికల్లో పెరుగుతుందో లేదో తెలియదు. అదే బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం కేసీఆర్ నలభై నుంచి యాభై ఎంపీ సీట్లను గెలుచుకుంటే బీజేపీకి చుక్కలు చూపించే అవకాశముంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గల కొన్ని నియోజకవర్గాల్లో కాస్త కష్టపడితే బీజేపీ యాభై సీట్లు గెలవడం కష్టమేం కాదని సీఎం కేసీఆర్ సర్వేలో తేలింది. అందుకే, కాస్త లోతుగా అధ్యయనం చేశాకే గెలుపునకు అవకాశాలున్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. ఈ క్రమంలో స్థానిక భాషలో పత్రికను ఆరంభిస్తే ప్రజలకు మరింత చేరువ అవుతామనే ఉద్దేశ్యంతో జాతీయ స్థాయిలో సొంత మీడియాను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ వడివడిగా అడుగులు ముందుకేస్తున్నట్లు సమాచారం.