హైదరాబాద్ :
అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ జీవన్మరణ సమస్యగా భావిస్తుంది.ఇప్పటికే రెండు దఫాలు అధికారం కొల్పోవడంతో వచ్చే ఎన్నికలను గెలిచి తీరాల్సిందే అన్న పట్టుదల హస్తం నేతల్లో కనిపిస్తోంది. ఈ దఫా అధికారం దక్కించుకోలేకపోతే..పార్టీ నామమాత్రంగా మారుతుందన్న ఆందోళనలో నేతలున్నారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగే అవకాశాలుండటంతో..వచ్చే ఎన్నికలను గెలిచేందుకు ఇప్పటి నుంచే నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
గత రెండు దఫాలుగా అధికారాన్ని టీ కాంగ్రెస్ చేజార్జుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి ఎన్నికలను తీసుకోవాల్సిన స్థాయిలో కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కే ప్రజలు పట్టం గడుతారని భావించి బోర్లా పడింది. సరిగ్గా ప్రచారం కూడా చేసుకోకపోవడంతో..21 స్థానాలకే కాంగ్రెస్ పరిమితం అయ్యింది.
పార్టీ తరుపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయింది.దీంతో మేజారిటి ఎమ్మెల్యేలు గులాబి గూటికి చేరారు. అధికార టీఆర్ఎస్ ను గట్టిగా నిలదీయలేకపోవడంతో కాంగ్రెస్ బలహీన పడింది.
ఆ తర్వాత వచ్చిన 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోను వ్యూహం లేకుండా వ్యవహరించింది టీ కాంగ్రెస్. చివరి వరకు పొత్తుల రాజకీయాల్లో మునిగి కనీసం టికెట్ల కేటాయింపులు సరిగా చేసుకోలేకపోయింది. మహకూటమి మద్య టికెట్ల పంచాయితీ తెలక మునుపే టీఆర్ఎస్ ఓ దఫా ప్రచారాన్ని ముగించింది. చివరి నిమిషంలో అభ్యర్ధులను
ఖారారు చేయడంతో కాంగ్రెస్ కు ప్రచార సమయం లేకుండా పోయింది. పైగా ఎన్నికల హమీలను ప్రజల్లోకి తీసుకెల్లలేకపోయింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అన్న నమ్మకాన్ని కల్పించడంలో విఫలమైంది. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితం అయ్యింది. ఆరు నెలల్లో వచ్చిన లోక్ సభ ఎన్నికల్లోపే 12 మంది కాంగ్రెస్
ఎమ్మెల్యేలు..కారెక్కడం, మరో ఎమ్మెల్యే బీజేపీలో చేరడంతో ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ పరిమితం అయ్యింది.
అదే సమయంలో బీజేపీ బలపడటంతో కాంగ్రెస్ రెండు వైపుల నుంచి దాడులను ఎదుర్కుంది. ఒక వైపు బీఆర్ఎస్, మరో వైపు బీజేపీ లోకి కాంగ్రెస్ నేతలు వలపబాట పట్టడంతో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మరింత వీక్ అయ్యింది. ఇక కాంగ్రెస్ ను గెలిపించానా ఆ తర్వాత వారు పార్టీలు మారుతారన్న విమర్శను కాంగ్రెస్ ఎదుర్కొలేకపోయింది. అందుకే ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కనీస పోటి ఇవ్వ లేకపోయింది. ఇక కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న సమయంలో పీసీసీ చీఫ్ గా రేవంత్ ..అంతర్గత కొట్లాటల నడుమ బహిరంగ సభలు, దీక్షలు,
నిరసనలు, యాత్రల ద్వారా..క్యాడర్ చేజారకుండా కాపాడుకుంటున్నారు.రాష్ట్ర వ్యాప్త యాత్ర చేస్తూ కాంగ్రెస్ బలాన్ని చాటుతున్నారు.
అయితే రేవంత్ ఒక్కరే కాదు..మిగిలిన కాంగ్రెస్ నేతలు అంతా..వచ్చే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. ఒకప్పుడు అధికారంతో ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇవే చివరి ఎన్నికలగు భావిస్తున్నారు. రెండు సార్లు అధికారం చేజారడంతో..ఈ సారి ఏది ఏమైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు గెలవలేమన్నట్లుగా చాలా మంది నేతలు ఎన్నికల ప్రచారం మాదిరిగా గ్రామాలను చుడుతున్నారు. అధికారిక కార్యక్రమాలు, చెక్కుల పంపిణి, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షల పేరుతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియెజకవర్గాల్లో నిత్యం పర్యటిస్తున్నారు. వీరికి దీటుగా కాంగ్రెస్ నేతలు అన్ని రకాల ఖర్చులను భరిస్తూ
నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నేతలు సై అంటే సై అంటూ పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారు.
గతంలో జరిగిన పొరపాట్ల ద్రుష్టిలో ఉంచుకుని…ఇప్పటి నుంచే ఎన్నికల హమీలను ప్రచారం చేస్తున్నారు. 2 లక్షల పంట రుణ మాఫీ, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, సొంతింటి నిర్మాణానికి 5 లక్షల ఆర్దిక సహాయం, 5 లక్షల ఆరోగ్య భీమా వంటి హమీలను ఇస్తుంది. దీంతో క్షేత్ర స్థాయిలో గ్రాఫ్ పెరుగుతోంది. ఇదే
దూకుడు ను ఎన్నికల దాకా కొనసాగిస్తే అధికారం హస్త గతం అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే నిత్యం ప్రజల్లో ఉండేందుకే ప్రధాన్యత నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కు మంచి రోజులు
వచ్చినట్లే అనే విష్లేషణలు వినిపిస్తున్నాయి.