ఏప్రిల్ 9వ తేది వరకు మహిళా జర్నలిస్టుల కు ఉచిత ఆరోగ్య పరీక్షలు

 

• మహిళా జర్నలిస్టుల కు ఉచిత ఆరోగ్య పరీక్షలు -సి.యస్ శాంతి కుమారి.
• నేటి నుండి ఏప్రిల్ 9 వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశిబిరాలు
• సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి సంకల్పం
• జిల్లా కేంద్రాలలో కూడా మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్యపరీక్షలు
• కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ లో భాగంగా 36 పరీక్షలు

 

హైదరాబాద్ మార్చి,29::

మహిళా జర్నలిస్టుల కు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు ప్రారంభించింది. బుధవారం సమాచార కమిషనర్
కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభించారు. సమాచార శాఖ కమీషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, ఆరోగ్య శాఖ కమీషనర్ శ్వేతా మహంతి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సి.యస్ శాంతి కుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలని సంకల్పించారని, అందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఈ మహిళా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కె.తారక రామారావు మహిళా దినోత్సవం మహిళా జర్నలిస్టులకి బారీ స్ధాయిలో వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలమేరకు ఈ ఆరోగ్య శిబిరం ప్రారంభిస్తున్నామని ఆమె తెలిపారు. ఉచిత ఆరోగ్యపరీక్షల ఫలితంగా మహిళా జర్నలిస్టులకు ఆర్ధిక భారం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సదావకాశాన్ని మహిళా జర్నలిస్టులు వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కెసిఆర్ కిట్, కంటివెలుగు పరీక్షలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు లాంటి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున దేశంలో మన తెలంగాణ రాష్ట్రం మాతా,శిశు మరణాల రేటును తగ్గించడంలో ముందున్నదని ఆమె పేర్కొన్నారు. కంటి వెలుగు మొదటి దశ కార్యక్రమంలో కోటిన్నర మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి 45 లక్షల మందికి కంటిఅద్దాల పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమంలో ఒక కోటి 70 లక్షల మందికి కంటి పరీక్షలు చేయాలని సంకల్పించామని ఆమె అన్నారు.
అక్రిడిటెడ్ మహిళా జర్నలిస్టులు, ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టుల కోసం మాసబ్ ట్యాంక్‌లోని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రధాన కార్యాలయం సమాచార భవన్‌లో పది రోజుల పాటు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మహిళా జర్నలిస్టులకు సూచించారు. ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులందరినీ కూడా ఈ క్యాంపులకు అనుమతిస్తారు. అయితే వారు తప్పనిసరిగా ప్రస్తుత ఆఫీస్ గుర్తింపు కార్డుని కలిగి ఉండాలి.

పదిరోజుల పాటు వైద్య శిబిరం నిర్వహణ…
ఈ రోజు నుండి ఏప్రిల్ 9, 2023 వరకు (30.03.2023 మరియు 02.04.2023 మినహా) పది రోజుల పాటు ఈ వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. వైద్య శిబిరం ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు జరగనుంది. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో పనిచేస్తున్న గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులకు ఆయా జిల్లా కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
మాస్టర్ హెల్త్ చెకప్ లో భాగంగా రక్త పరీక్ష (C.B.P), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3 మొదలైనవి, ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయి, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి ఉంటాయని ఆయన అన్నారు. ఈ పరీక్షల నివేదికలను అదే రోజున అందజేయనున్నారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లి, కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్లు వెంకటరమణ, జగన్, శ్రీనివాస్, మధుసూదన్, డిప్యూటి డైరెక్టర్లు వై. వెంకటేశ్వర్లు, హాష్మి, పాండురంగారావు, ప్రసాద్ రావు, రాజారెడ్డి, యామిని, సత్యనారాయణ రెడ్డి, రాధాకిషన్, మల్లయ్య,జయరాంమూర్తి,సమాచార శాఖ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest