కాంగ్రెస్ ఏమీ చేసిందో చింతమడకలో చూపిస్తా:రేవంత్

* యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో
* టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ :
“కాంగ్రెస్ పార్టీకి ఇన్ని అవకాశాలు ఇస్తే ఏమీ చేశారు అని డ్రామారావు అంటుండు. కాంగ్రెస్ ఏం చేసిందో వరంగల్ ఏకశిల పార్కు దగ్గర చర్చ పెడదాం. నేను చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తా. మీరు చెప్పింది తప్పైతే ప్రజలకు క్షమాపణ చెబుతారా? మీ అయ్యా పుట్టిన చింతమడక పోదాం. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమిటో అక్కడే చూపిస్తా. చింతమడకలో గుడి, బడి నీళ్ల ట్యాంక్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పంచ్ ఇచ్చారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా సోమవారం హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరిధిలోని పులిగిల్ల గ్రామం నుంచి పరకాల వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పరకాల బస్ స్టాండ్ సెంటర్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అడ్డా. పరకాలకు ఎంతో చరిత్ర ఉంది. ఈ గడ్డ పోరాటల అడ్డా. పౌరుషానికి మారు పేరు. ఈ గడ్డ మీద పుట్టిన ఆడబిడ్డలు రజాకార్లను తరిమికొట్టారు. ఎప్పుడైనా ఆధిపత్యానికి, పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఈ గడ్డది. ఇటువంటి గడ్డ మీద ఇప్పుడు దళారులు, దండుపాళ్యం ముఠా రాజ్యమేలుతుంది. ఇక్కడి ఎమ్మెల్యే పేరులోనే ఉంది ధర్మం ఉంది. కానీ అతని గుణంలో ధర్మం లేదు. ధర్మారెడ్డి కాదు దందాల రెడ్డి పేరు సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ మొత్తం కాంట్రాక్టులు ధర్మా రెడ్డివే. ఏ దోపిడీలో చూసినా ధర్మా రెడ్డి పేరే వినిపిస్తోంది. 2014 నుంచి కేసీఆర్ 17 లక్షల కోట్లవిలువైన తొమ్మిది బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 5 లక్షల కోట్ల అప్పు చేశారు. మొత్తం 23 లక్షల కోట్లు ఎక్కడ పోయాయి. దళితులకు మూడెకరాల భూమి ఇయ్యలేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇయ్యలేదు. యువతకు ఉద్యోగాలు ఇయ్యలేదు. యాదవ బిడ్డలకు గోర్రెలు ఇయ్యలేదు. గౌడ సోదరుల సమస్యలు తీరలేదు. మరీ 23 లక్షల కోట్లు ఎక్కడి పోయాయి. ఇక్కడ అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీ చలవే. వైఎస్ రాజశేఖర రెడ్డి, కొండా మురళి నేతృత్వంలో సోదరి కొండా సురేఖ మంత్రిగా ఉన్నప్పుడు పరకాల అభివృద్ధి జరిగింది. పేద ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా మీరు ఆలోచించండి. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందాయి. వ్యవసాయం పండగైంది. కానీ టీఆర్ఎస్ పాలనలో దండగయ్యే పరిస్థితి దాపురించింది. వరి వేస్తే ఉరే అని సాక్షాత్తూ కేసీఆర్ చెబుతున్న పరిస్థితి తెలంగాణలో నెలకొంది. మేడారం నుంచి పాదయాత్ర మొదలు పెట్టా. మొదట్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేస్తున్నా. నా పాదయాత్ర చూసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ల కడుపులో భయం జోరపడ్డది. అందుకే భూపాలపల్లిలీ నా యాత్ర ముగియగానే కేటీఆర్ పిలిపించుకున్నారు. ఇప్పుడు ఆ డ్రామారావు కాంగ్రెస్ పార్టీకి అన్ని అవకాశాలు ఇస్తే ఏమీ చేసిందని అడుగుతుండు. డ్రామారావుకు ఇదే నా సవాల్. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేసిందే అనే విషయంలో వరంగల్ ఏకశిలా పార్క్ వద్ద చర్చకు సిద్ధం. నేను చెప్పేదీ ఏదైనా తప్పు ఉంటే ముక్కు నేలకు రాసిపోతా. మీరు చెప్పింది తప్పైతే.. నీవు, నీ అయ్యా నాలుగు కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా.. ప్రతీ ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ కట్టినవే. అంతెందుకు మీ అయ్యా పుట్టిన చింతమడక పోదాం. అక్కడ బడి, గుడి, నీళ్ల ట్యాంక్ అన్ని కాంగ్రెస్ కట్టినవే. ఇవే హైటెక్ సిటీ, శిల్పారామం, బస్సు డిపోలు, కాజీపేట, కాచిగూడ ఇలా రైల్వే స్టేషన్లు, మెట్రో రైల్, సాఫ్ట్ వేర్ కంపెనీలు..ఇలా ప్రతి గ్రామంలో గుడి, బడి, కరెంట్, పారే కాల్వ అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినవే. లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. వేల కోట్ల రైతు రుణలను మాఫీ చేశాం. ఉచిత కరెంట్, ఫీజు రీయిబంర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను మేము తెచ్చాం. నీ అయ్యా ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్ హయాంలో ఉన్న పేపర్ మిల్లులు, చక్కెర ఫ్యాక్టరీలు మూసివేశారు. మీరు మాత్రం పేపర్లు, టీవీలు పెట్టుకున్నారు. పేదల భూములను ఆక్రమించుకున్నారు. ఫామ్ హౌస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మాది కుటుంబ పాలనే..నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులు అని డ్రామారావు అంటున్నారు. మరీ అదే నిజమైతే.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నీ కుటుంబమే అయితే…10 ఎకరాలలో కట్టుకున్న ప్రగతి భవన్ కు పేదలను ఎందుకు రానివ్వడం లేదు? 1200 మంది అమరవీరుల కుటుంబాలలో ఏ ఒక్కరికైనా ఇంటికి పిలిచి బుక్కెడు బువ్వ పెట్టారా? నిజంగా తెలంగాణ ప్రజలు మీ కుటుంబమే అయితే ..పీజీ విద్యార్థి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? హైదరాబాద్లో ఒక బాలుడిని కుక్కలు పీక్కతింటే వారి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు. అయిదు రోజులైనా నేరస్తులను పట్టుకుని ఎందుకు శిక్షించలేదు? నీ ఇంట్లో బిడ్డను ఎవరైనా చంపితే ఇలాగే చేస్తారా? ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నా చూడటానికి రాని మీకు ఎలా మేం కుటుంబ సభ్యులం అవుతాం? అయినా నువ్ మా కుటుంబం అనుకుంటే.. పరకాల సాక్షిగా మా తెలంగాణ కుటుంబం నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం. మా తెలంగాణ కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబం లేదు. తెలంగాణ తెచ్చామని చెప్పుకున్నవారికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సోనియా గాంధీ గారు కలలుగన్న సామాజిక తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ గెలవాలి. పేదల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు లేని ప్రతీ పేదకు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తాం. గత ఏడాది వడగండ్ల వానకు 300 కోట్ల పంట నష్టం జరిగింది. వచ్చి చూసి వెళ్లిన మంత్రులు ఇప్పటివరకు పరిహారం అందించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రైతులకు పంట నష్టం చెల్లించే బాధ్యత మేం తీసుకుంటాం. ఆడబిడ్డలకు రూ.1200 ఉన్న సిలిండరును రూ.500లకే ఇస్తాం. . రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇన్నీ మంచి పనులు చేయాలంటే ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి.

ప్రీతి, కుమార స్వామికి మృతికి నివాళి
కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధిని ప్రీతి నాయక్, ములుగు డీసీసీ అధ్యక్షుడు కుమార స్వామి మృతికి నివాళిగా పరకాల స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మౌనం పాటించి సంతాపం తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest